calender_icon.png 18 January, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయిలకు తప్పని ఓటమి

06-07-2024 12:05:00 AM

వన్డే సిరీస్‌తో పాటు ఏకైక టెస్టులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి దక్షిణాఫ్రికాపై దుమ్మురేపిన భారత మహిళల జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో హర్మన్‌ప్రీత్ బృందం పోరాడి ఓడింది. సఫారీ బ్యాటర్లు భారీ స్కోరు చేయగా.. ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన రాణించినా.. చివర్లో ఒత్తిడికి గురైన టీమిండియా పరాజయం వైపు నిలిచింది. 

చెన్నై: భారత మహిళల క్రికెట్ జట్టుకు తాజా సీజన్‌లో తొలి పరాజయం ఎదురైంది. శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన టీ20లో హర్మన్‌ప్రీత్ బృందం 12 పరుగుల తేడా తో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తజ్మీన్ బ్రిట్స్ (56 బంతుల్లో 81; 10 ఫో ర్లు, 3 సిక్స ర్లు), మరినే కాప్ (33 బంతుల్లో 57; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో రాణించారు. కెప్టెన్ లార వాల్వర్ట్ (33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చింది.

భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్, రాధ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మన అమ్మాయిలు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (30 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో పోరాడగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (46; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (35; 5 ఫోర్లు) సత్తాచాటారు.  తజ్మీన్ బ్రిట్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడే రెండో మ్యాచ్ జరగనుంది. 

బౌలర్లు విఫలం: ఫీల్డింగ్ వైఫల్యాలతో ప్రత్యర్థికి ధారాళంగా పరుగులు సమర్పించుకున్న భారత జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించింది. షఫాలీ వర్మ (18), స్మృతి నిలకడగా ఆడటంతో.. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ 54/0తో మంచి స్థితిలో నిలిచింది. ఇదేజోరుతో సాగితే.. ఛేదన పెద్ద కష్టం కాదు అని భావించినా.. ఆ తర్వాత పట్టు బిగించిన సఫారీ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో పాటు.. పరుగులు నియంత్రించి టీమిండియా బ్యాటర్లను అడ్డుకున్నారు. దీంతో భారత లక్ష్యం 36 బంతుల్లో 80 పరుగులకు చేరగా.. జెమీమా చక్కటి షాట్లతో అభిమానుల్లో ఆశలు రేపింది. మరో ఎండ్‌లో కౌర్ ధాటిగా ఆడలేకపోవడం కూడా భారత విజయావకాశాలను దెబ్బతీసింది.