calender_icon.png 3 December, 2024 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్‌ఫిట్ ఆఫీసర్ డైరెక్టర్‌గిరీ పైరవీ!

14-11-2024 12:57:21 AM

  1. ఏపీ నుంచి అడ్డదారిలో తెలంగాణలో పోస్టు
  2. జర్నలిజంలో పట్టా లేదు.. డీపీఆర్వోగా చేయలేదు..
  3. పైగా అవినీతి ఆరోపణలు.. విజిలెన్స్ కేసులు 
  4. సమాచారశాఖలో అడిషనల్ డైరెక్టర్ లీలలే వేరు !

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్ర సమాచార శాఖలో అత్యున్నత మైన పోస్టు డైరెక్టర్. ఆ సీటులో కూర్చేనేందుకు అర్హత కనీసం సదరు అధికారి జర్నలిజం చదివి ఉండాలి. ప్రెస్‌నోట్ రాయగలిగి ఉండాలి. కానీ, అలాంటి అర్హతలేవీ లేకుండానే సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్‌ఎల్‌ఆర్ కిశోర్‌బాబు డైరెక్టర్ పోస్టుకు పెద్దఎత్తున పైరవీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆయనపై అవినీతి, అక్రమాల ఆరోపణలు సైతం ఉన్నాయి. ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఇప్పటికే ఆయనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదులు సైతం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో సమాచార శాఖ పరిధిలో ఒక డైరెక్టర్, ఒక చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఇంజినీర్ పోస్టు ఉండేది.

అయితే కమల్‌నాథన్ కమిటీ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఇంజినీర్ (సీఐఈ)పోస్టును ఏపీకి, డైరెక్టర్ పోస్టును తెలంగాణకు కేటాయించిది. అయితే తెలంగాణలో లేని సీఐఈ పోస్టు విభజన తర్వాత కూడా కొనసాగింది. ఏపీలోని గుంటూరుకు చెందిన జోన్-3 అధికారి ఎల్‌ఎల్‌ఆర్ కిశోర్‌బాబు నియమితులయ్యారు. అలా సీఐఈగా విధులు నిర్వర్తిస్తూ 2017లో అడిషనల్ డైరెక్టర్ ఉన్నతి కోసం ఆయన కోర్టుకు వెళ్లారు.

ఒకవేళ ఆయన ఉద్యోగోన్నతికి అర్హుడైతే సర్వీస్ రూల్స్ సవరించి, ఉద్యోగోన్నతి కల్పించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, సర్వీస్ రూల్స్‌ను సవరించకుండానే గత ప్రభుత్వం కిశోర్‌బాబుతో పాటు మరోవ్యక్తికి అడిషనల్ డైరెక్టర్లుగా ఉద్యోగోన్నతి కల్పించిందనే ఆరోపణ లు ఉన్నాయి.

ఉద్యోగోన్నతి పొందిన తర్వాత కిషోర్ బాబు డిప్యుటేషన్‌పై ఎఫ్‌డీసీకి వెళ్లారు. ప్రస్తుతం సమాచారశాఖలో అడిషనల్ డైరెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నారు. ఇప్పుడాయన కన్ను డైరెక్టర్ పోస్టుపై పడిందని ఆ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. 

మొదటి నుంచీ ఆరోపణలే..

బీసీ-సి కేటగిరీకి చెందిన కిశోర్‌బాబు అక్రమంగా ఎస్సీ కేటగిరీ పత్రాలు చేయించుకుని, ఏళ్ల నుంచి ఎస్సీ రిజర్వేషన్లు వినియోగించుకుంటున్నారని, ఏపీకి చెందిన ఆయన దొడ్దిదారిలో తెలంగాణలో పోస్ట్ సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నా యి.

సమాచారశాఖ అధికారిగా సుమారు రూ.14 కోట్ల టీవీ యాడ్స్‌ను పేరు, ఊరు లేని ఛానెళ్లకు (శాటిలైట్ ఛానెళ్లు కానివి) ఇచ్చారని, తద్వారా తాను లబ్ధిపొంది, సర్కార్ ఖజానాకు గండికొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక్కటి కాదు ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని ఆ శాఖ అధికార వర్గాలు తెలుపుతున్నాయి. టీవీ యాడ్స్ జారీపై ఇప్పటికీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరుగుతోంది.

అయి నప్పటికీ.. ఆయన డిపార్ట్‌మెం టల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) అప్రూవల్ తీసుకుని డైరెక్టర్ పోస్టుకు ప్రయత్నిస్తుండడం, ఆయనపై ఆరోపణలన్నీ తెలుసుకుని సమాచారశాఖ మంత్రి పొంగులేటి ఆ ఫైలును పక్కకు పెట్టారని తెలిసింది. మరోవైపు కిశోర్‌బాబు అక్రమాలు వెలికితీ యాలని సమాచారశాఖ అధికార వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. 

ఒక్క అర్హతైనా లేదు

నిబంధనల ప్రకారం ఏపీఆర్వో నుంచి డైరెక్టర్ స్థాయి అధికారి వరకు ప్రతిఒక్కరికీ ప్రెస్ నోట్ రాయడం రావాలని, అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగోన్నతి పొంది డైరెక్టర్ కావాలంటే సదరు అధికారి గతంలో డీపీఆర్వోగా పనిచేసి ఉండాలని, జర్నలిజం కూడా చదివి ఉండాలని, కిశోర్‌బాబుకు మూడింట్లో ఏ ఒక్క అర్హతైనా లేదంటున్నారు.

కిశోర్‌బాబు ప్రతి దశలోనూ ఉన్నతాధికారుల అండదండలతో తనకు అనుకూలంగా నిబంధనలను మార్చుకుంటూ పోతున్నారని మండిపడుతున్నారు. నిన్నమొన్నటి వరకు సమాచార శాఖలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఒకరు ఇంజినీరింగ్ విభాగం నుంచి వచ్చిన వారికి కూడా సమాచారశాఖ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి కల్పించవచ్చంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆశాఖ మంత్రి డైరెక్టర్ ఉద్యోగోన్నతి ఫైలును పక్కన పెట్టినట్టు సమాచారం.