calender_icon.png 1 October, 2024 | 2:47 AM

అన్‌ఫిట్ సీఎం.. రేవంత్

01-10-2024 12:57:04 AM

  1. ఢిల్లీకి డబ్బులు పంపేందుకే మూసీ ప్రాజెక్ట్ 
  2. రాహుల్ బుల్డోజర్‌పై ప్రశ్నిస్తాడు.. రేవంత్ వాటినే పంపుతుండు 
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): మూసీ బాధితులెవరూ ధైర్యం కోల్పోవద్దని.. అందరికీ బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. సోమవారం రాత్రి ఆయన  రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో అత్తాపూర్  పరిధిలోని హైదర్‌గూడ లక్ష్మీనగర్ పార్క్‌లో మూసీ బాధితులతో సమావేశమయ్యారు.

అంతకు ముందు అధికారులు మార్కింగ్ వేసిన ఇళ్లను ఎమ్మెల్సీ మధుసూదనాచారి,  మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌషిక్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, డాక్టర్ సంజయ్, నాయకులు నరేందర్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మెతుకు ఆనంద్, బాల్క సుమన్ తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్ఠానానికి డబ్బుల సంచులు మోసేందుకే రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ఇల్లనేది పేద, మధ్య తరగతి ప్రజలకు ఒక కల అని, వాటిని చెరిపివేయొద్దన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్లను తీసుకొని డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

చందాలు వేసుకొని తిరుపతి రెడ్డికి ఇద్దాం 

మనందరం చందాలు వేసుకొని రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డికి ఇద్దామని, వాటితో 4 బెడ్‌రూం ఇళ్లు కొనిస్తే  ఆయన ఒప్పుకుంటాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉందన్నారు. మరి దానిని కూలుస్తారా అని ప్రశ్నించారు.

మూసీ బాధితుల ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారో కనీసం మంత్రులకు కూడా అవగాహన లేదన్నారు. ఢిల్లీలో రాహుల్ బాబా బుల్డోజర్‌పై ప్రశ్నిస్తాడని, ఇక్కడేమో రేవంత్ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. 

కలిసి పోరాడుదాం..

దేశంలో సుప్రీం ప్రభుత్వమైన కేంద్ర సర్కారు రైతులకు వ్యతిరేకంగా ఉన్న నల్లచట్టాలను ప్రజాగ్రహంతో వెనక్కి తీసుకుందని, మనమందరం కలిసి పోరాడితే రేవంత్ ప్రభుత్వం దిగివస్తుందన్నారు. రేవంత్‌రెడ్డి అన్‌ఫిట్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్‌పై ఎంతో నమ్మకం పెట్టుకొని ఓట్లేస్తే ఇప్పుడు వారిని ఇక్కట్లపాలు చేస్తున్నారన్నారు.

కూల్చివేతలపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఖర్చులు కూడా బీఆర్‌ఎస్ భరిస్తుందన్నారు. ఎన్నో వేల కిలోమీటర్లు ఉన్న గంగానది ప్రాజెక్టు శుద్ధి కోసం పీఎం మోదీ రూ.45 వేల కోట్లు కేటాయించారని,  కేవలం 55 కిలోమీటర్ల పొడవున్న మూసీ సుందరీకరణకు రేవంత్ రెడ్డి లక్షన్నర కోట్లు ఖర్చుపెడతామనడం పెద్ద స్కామే అన్నారు.

మూసీతో తమకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ చెప్పడం సిగ్గు చేటని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డిని బండబూతులు తిడుతున్నారని, అతడి స్థానంలో ఇంకెవరైనా ఉంటే మూసీలో దూకి సూసైడ్ చేసుకునేవారని ధ్వజమెత్తారు. రెవెన్యూ మంత్రితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లు హిమాయత్‌సాగర్‌లో ఉన్నాయని, మరి వాటిని కూలగొడతారా అని సవాల్ విసిరారు.

అనంతరం కిషన్‌బాగ్‌లో కేటీఆర్, మహమూద్ అలీ మాట్లాడారు. తమ సర్కారు హయాంలో అల్లర్లు లేవని, కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు వచ్చినా గొడవలే జరుగుతాయన్నారు. గత పదేళ్లలో ఒక్క చిన్నగొడవ కూడా రాలేదన్నారు. అన్నదమ్ముల మాదిరిగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నామని, లింకు రోడ్లు వేసుకున్నామరు. హైదర్‌గూడలో పలువురు బాధితులు సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు.