calender_icon.png 1 November, 2024 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్ధవ్‌కు నమ్మకద్రోహం!

16-07-2024 12:52:36 AM

  1. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు 
  2. కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయమైంది..
  3. ఢిల్లీలో మరో కేదార్‌నాథ్ ఆలయం ఎందుకు?
  4. అది కూడా మరో కుంభకోణం అవుతుంది
  5. ప్రధాని నరేంద్రమోదీ మాకు శత్రువు కాదు 
  6. జ్యోతిర్మఠ్ శంకరాచార్య సంచలన వ్యాఖ్యలు

ముంబై, జూలై 15: శివసేన (యూబీటీ) అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి ఉద్ధవ్ ఠాక్రే నమ్మద్రోహానికి బలయ్యారని జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి అన్నారు. హిందూమతంలో నమ్మకద్రోహం అనేది మహా పాపమని పేర్కొన్నారు. ఉద్ధవ్ ఆహ్వానం మేరకు సోమవారం ఆయన ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్లారు. ఉద్ధవ్‌తో సమావేశం అనంతరం స్వామి అవిముక్తేశ్వరానంద్ మీడియాతో మాట్లాడారు. కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం కనిపించకుండా పోయిందని, ఈ అంశాన్ని ఎన్నిసార్లు ప్రస్తావిం చినా ప్రయోజనం ఉండటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి అన్నారు. ‘మనం హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాం. పుణ్యపాపాలను నమ్ముతున్నాం. హిందూ ధర్మంలో నమ్మకద్రోహం మహా పాపాల్లో ఒకటి. ఉద్ధవ్ ఠాక్రేకు అదే జరిగింది. ఇది మాకు తీవ్ర వేదన కలిగించింది. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు ఆ వేదన పోదు. నమ్మకద్రోహం చేసినవాడు హిందువు కాదు. ఆ నమ్మకద్రోహాన్ని కూడా క్షమించినవాడే నిజమైన హిందువు’ అని పేర్కొన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో 2022లో శివసేన ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేయటంతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. కొంతకాలానికి ఎన్సీపీ కూడా ముక్కలై అజిత్‌పవార్ వర్గం షిండే ప్రభుత్వంలో చేరిపోయింది. ఈ రాజకీయ కుట్రను దృష్టిలో పెట్టుకొని స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. 

మాకు అందరూ ఒక్కటే

తమకు ఏ రాజకీయ వర్గంతోనూ విబేధాలు లేవని, అందరినీ సమానంగా చూస్తామని స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి తెలిపారు. ‘నేను మత నాయకుడిని. మేం రాజకీయాలు చేయబోము. కానీ, నమ్మకద్రోహాన్ని ధర్మం అంగీకరించదు. ఉద్ధవ్ ఠాక్రేకు జరిగిన నమ్మద్రోహాన్ని యావత్ మహారాష్ట్ర ప్రజలకు తీవ్ర వేదన కలిగించింది. ఆ విషయం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది’ అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 స్థానాలకు గాను ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మహా వికాస్ అఘాడీ 30 చోట్ల విజయం సాధించింది. శివసేన (యూబీటీ) 9 సీట్లు గెలుచుకొన్నది.

ప్రధాని మోదీ మా శత్రువు కాదు

ప్రధాని మోదీ తనకు శత్రువేమీ కాదని స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ప్రకటించారు. ఇటీవల ప్రధానికి ఆశీస్సులు ఇచ్చిన విషయంపై కూడా ఆయన స్పందించారు. ‘ఆయన (మోదీ) నా వద్దకు వచ్చి ప్రణామాలు చేశారు. అలా మా వద్దకు ఎవరు వచ్చినా ఆశీర్వదించటం మా నియమం. నరేంద్రమోదీ మా శత్రువు కాదు. మేం ఆయన శ్రేయోభిలాషులం. ఎప్పుడూ ఆయన సంక్షేమం గురించి మాట్లాడుతాం. ఒకవేళ ఆయన తప్పు చేసినా ఆ విషయాన్ని నిర్భయంగా చెప్తాం’ అని స్పష్టంచేశారు.   

కేదార్‌నాథ్‌లో బంగారం కుంభకోణం

12 పవిత్ర జ్యోతిర్లింగాల్లో ఒకటైన హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయంలో భారీ బంగారం కుంభకోణం జరిగిందని స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఆరోపించారు. ‘కేదార్ నాథ్‌లో బంగారం కుంభకోణం జరిగింది. 228 కిలోల బంగారం కనిపించ కుండా పోయింది. అయినా ఇప్పటివరకు దానిపై దర్యాప్తు మొదలు కాలేదు. ఈ అంశాన్ని ఎవరూ ఎందుకు ప్రస్తావించటంలేదు? దీనికి బాధ్యులు ఎవరు? ఈ కుంభకోణం అలా ఉండగానే ఢిల్లీలో మరో కేదార్‌నాథ్ ఆలయం కట్టాలని చూస్తున్నా రు. ఇదో మరో కుంభకోణంగా మారుతుంది. ఇలా జరుగకూడదు’ అని అన్నారు.