19-03-2025 08:11:26 PM
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలంగాణ రాష్ట్ర యూనిట్ కన్వీనర్ కే. ఆంజనేయ ప్రసాద్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఉద్యోగుల హక్కులను ఉల్లంఘించే అన్యాయపు కార్మిక విధానాలను వెంటనే ఆపాలని యునైటెడ్ ఫోర్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూ ఎఫ్ బి యు) తెలంగాణ రాష్ట్ర యూనిట్ కన్వీనర్ కె ఆంజనేయ ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పనితీరు సమీక్ష, పీఎస్ఐ మార్గదర్శకాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నారాయణగూడలోని ఎస్బీఐఓఏ భవన్ లో బ్యాంక్ యూనియన్స్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె.ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగించే, ఉద్యోగులు, అధికారుల మధ్య విభజన, వివక్షను సృష్టించే పనితీరు సమీక్ష, పీఎస్ఐపై ఆదేశాలు 8వ జాయింట్ నోట్ ను ఉల్లంఘిస్తాయన్నారు.
పీఎస్బీ స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తాయన్నారు. బ్యాంకు ఉద్యోగులు, అధికారుల భద్రతను కాపాడాలని, అసభ్య ప్రవర్తన, దాడుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. పీఎస్బీలలో కార్మికులు, ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పథకం తరహాలో గరిష్ట పరిమితిని రూ.25 లక్షలకు పెంచడానికి గ్రాట్యుటీ చట్టాన్ని సవరించాలని, ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించాలన్నారు. రాయితీ నిబంధనలపై ఉద్యోగులు, అధికారులకు ఇచ్చే సిబ్బంది సంక్షేమ ప్రయోజనాలపై ఆదాయపు పన్నును వేయకూడదని, యాజమాన్యాలు దీన్ని భరించాలని కోరారు.
ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటాను కనీసం 51 శాతం కొనసాగించాలని, ప్రభుత్వం (డీఎఫ్ఎస్) బ్యాంకుల పాలనలో మైక్రో మెనేజ్ మెంట్ చేయకుండా ఉద్యోగుల సేవా నిబంధనలకు సంబంధించిన నిర్ణయాల్లో బహు పాక్షిక సంప్రదింపులను కొనసాగించాలని, బ్యాంకింగ్ రంగంలో శాశ్వత ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల హక్కులను ఉల్లంఘించే అన్యాయపు కార్మిక విధానాలను వెంటనే ఆపాలని కోరారు.
తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలుమార్లు కోరామని, అయినా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 23 అర్ధరాత్రి నుండి 25 అర్ధరాత్రి వరకు 2 రోజుల పాటు అఖిల భారత బ్యాంకు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో యూఎఫ్బీయు రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు, కె.ఎస్.శాండిల్య, ఐ. కృష్ణంరాజు, హత్కర్ శంకర్, వెంకటరామయ్య, ఫణి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.