13-03-2025 01:38:23 AM
డమ్మీ తుపాకులు, రబ్బరు బులెట్లతో దుండగుల హల్‌చల్
చిత్తూరు, మార్చి 12: చిత్తూరులోని గాంధీ నగర్ రోడ్డులో బుధవారం ఉదయం లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ షోరూంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పుష్ప కిడ్స్ వరల్డ్ యాజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా భారీ దోపిడీకి ప్లాన్ చేయడం వెనుక మరో స్థానిక వ్యాపారి హస్తం ఉన్నట్లు తేలింది.
డమ్మీ తుపాకులు, రబ్బరు బులెట్లతో చంద్రశేఖర్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కాల్పులతో బీభత్సం సృష్టించి నగదు ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే పోలీసుల రంగ ప్రవేశంతో వారి వ్యూహం బెడిసికొట్టినట్లయింది. దాదాపు రెండున్నర గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది.
కర్ణాటక, ఉత్తరాదికి చెందిన వ్యక్తులు దొంగల ముఠాలో సభ్యులుగా ఉన్నారు. ఈ దోపిడీకి ప్లాన్ వెనుక ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని సుబ్రమణ్యం ప్రధాన సూత్రధారని పోలీసులు నిర్థారించారు. కర్నూలు జిల్లాకు చెందిన సుబ్రమణ్యం చిత్తూరులో ఫర్నీచర్ వ్యాపారం ప్రారంభించారు.
అయితే వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదే నగరంలో పుష్ప కిడ్స్ వరల్డ్ షోరూం ఏర్పాటు చేసి మంచి పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్‌పై సుబ్రమణ్యం కన్ను పడింది. ఆయనను బెదిరించి పెద్ద ఎత్తున నగదు కొట్టేయాలని భావించిన సుబ్రమణ్యం దొంగల ముఠాతో భారీ దోపిడీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగింది?
చిత్తూరుకు చెందిన వ్యాపారి చంద్రశేఖర్ గాంధీనగర్ రోడ్డులో నివాసం ఉంటున్నారు. మూడంతుస్తుల సొంత భవనంలో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో పుష్ప కిడ్స్ వరల్డ్ షో రూం పేరిట చిన్న పిల్లలకు సంబంధించిన బొమ్మలు, ఫ్యాన్సీ స్టోర్ దుకాణం నిర్వహిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం 6.30 గంటలకు చంద్రశేఖర్ నివాసంలోకి ఐదుగురు వ్యక్తులు ప్రవేశించారు. చంద్రశేఖర్ భార్యను కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు ఇవ్వాలని బెదిరించారు.
చంద్రశేఖర్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా తమతో తెచ్చుకున్న తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి చంద్రశేఖర్ కుమారుడు తప్పించుకొని బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డమ్మీ తుపాకులు, రబ్బరు బులెట్లను స్వాధీనం చేసుకున్నారు.