హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాన జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్‌లకు రెండు భిన్నమైన తీర్పులను ఇచ్చాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ చేతికి అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను సీట్లుగా మార్చుకోవడంలో విఫలమయింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆ పార్టీ అందుకు అవసరమైన సీట్లను సాధించలేక చతికిల పడింది.
మరోవైపు ఎన్నికల ప్రకటన వెలువడినప్పటినుంచీ పోలింగ్ ముగిసే దాకా ఒపీనియన్ పోల్స్,ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమ పార్టీకి వ్యతిరేకంగా అంచనాలు వెల్లడించినా కమలం పార్టీ ఈ ప్రతికూలతలన్నిటినీ ఎదుర్కొని ఎవరూ ఊహించిన ఘన విజయాన్ని సాధించింది. పదేళ్లు అధికారంలో కొనసాగడం కారణంగా ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేక గాలికి ఎదురొడ్డి ముచ్చటగా మూడో సారి అధికారాన్ని కైవసం చేసుకోవడం చిన్న విషయమేమీ కాదు.
ఇందుకు ప్రతిపక్షాల అనైక్యత ఒక కారణమయితే అట్టడుగు స్థాయి వరకు బలమైన సంస్థాగత వ్యవస్థ కలిగిన కమలం పార్టీ అమలు చేసిన వ్యూహం మరో ముఖ్యకారణం.బలమైన జాట్ వర్గం తమకు దూరమవుతున్నారన్న విషయాన్ని ముందే గ్రహించిన కమలనాథులు ఇతర వర్గాన్నిటినీ ఒక్కతాటిపైకి తేవడంలో విజయం సాధించారు.
హర్యానా కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలకు తోడు, ఇండియా కూటమి భాగస్వామి అయిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదుర్చుకోలేకపోవడం హస్తం పార్టీ ఓటమికి ప్రధాన కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరక పోవడంతో ‘ఆప్’ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీకి దిగింది.
ఒక్క స్థానంలో కూడా గెలవకపోయినప్పటికీ ప్రభుత్వవ్యతిరేక ఓటును చీల్చింది. ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో ఒకటిన్నర శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ లాభపడింది. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల అంతరం ఒక శాతంలోపే. హర్యానాలో బీజేపీ విజయంలో ప్రధాన భూమిక ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలదే.
తాము ఏటికి ఎదురీదుతున్నామన్న విషయాన్ని ముందునుంచే గ్రహించిన ఈ అగ్రనాయకులు పార్టీ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. అభ్యర్థుల ఎంపికనుంచి ప్రచారం దాకా భిన్నమైన వ్యూహాన్ని అనుసరించారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హూడాపై ఎక్కువ ఆధారపడ్డంపై ఇతర సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆదినుంచి అసంతృప్తితోనే ఉన్నారు. రాహుల్ గాంధీ లాంటి నేతలు ఎంతగా ప్రయత్నించినా క్షేత్రస్థాయిలో దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.
ఇక జమ్మూ కశ్మీర్ ఫలితాలు బీజేపీకి చేదు గుళికేనని చెప్పవచ్చు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జమ్మూ ప్రాంతంలోని హిందూ ఓటర్లతో పాటుగా కశ్మీర్ లోయలో ఇతర పార్టీల పరోక్ష మద్దతుతో అధికారంలోకి రావాలన్న ఆ పార్టీ ఆశలపై ఫలితాలు నీళ్లు చల్లాయి.
హంగ్ అసెంబ్లీకే ఎక్కువ అవకాశాలన్నాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. నిజానికి ఇది ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ విజయమని చెప్పాలి.
మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బలమైన పోటీ ఇస్తుందని మొదట్లో అం దరూ ఊహించారు. అయితే ఆ పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైం ది. చివరికి మెహబూబా కుమార్తె సైతం ఓటమి పాలయింది. జమ్మూ ప్రాం తంలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్ సైతం నిరాశపర్చింది.
ఆ పార్టీ గెలిచింది ఆరు సీట్లే. వీటన్నిటినీ అధిగమించి ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా పాపులారిటీయే ఆ కూటమిని గెలిపించిందని చెప్పాలి. త్వరలో జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాజా ఫలితాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి.