calender_icon.png 25 April, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదులకు ఊహించని శిక్ష ఖాయం

25-04-2025 01:40:31 AM

ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరికలు

  1. పహల్గాం దాడి వెనుక కుట్రదారులు ఎవరున్నా గుర్తిస్తాం
  2. ఏ ఒక్క ఉగ్రవాదినీ వదిలిపెట్టం 
  3. వాళ్లు భూమ్మీద ఎక్కడున్నా పట్టుకుంటాం

* ఈ ప్రపంచానికి చెబుతున్నా..  భూమ్మీద ఆ ఉగ్రవాదులు ఎక్క డున్నా పట్టుకుని, వారు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం. భారత స్ఫూర్తిని ఉగ్రవాదం ఎన్న టికీ దెబ్బతీయలేదు. దేశం మొత్తం ఉగ్రదాడిని ఖండించింది. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులపై ప్రతీకా రం కోసం చూస్తున్నారు. ఉగ్రవా ద అవశేషాలు ఏమున్నా వాటిని పూర్తిగా నేలమట్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 

 ప్రధాని నరేంద్ర మోదీ

పట్నా, ఏప్రిల్ 24: ‘పహల్గాం దాడి వెనుకున్న ప్రతి ఉగ్రవాదిని, కుట్రదారులను భారత్ వెతికిపట్టు కుంటుంది. ఈ రోజు బీహార్ గడ్డ మీద నుంచి నేను ఈ ప్రపంచానికి చెబుతు న్నా. ఈ దాడికి కారణమైన టెర్రరిస్టులను వారి వెనక ఉన్న వారిని తప్పకుండా గుర్తించి శిక్షిస్తాం. ఈ భూమి మీద వారు ఎక్కడున్నా పట్టుకొని వారు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం.

భారత స్ఫూర్తిని ఉగ్రవాదం ఎన్నటికీ దెబ్బ తీయలేదు’. అని ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడిని ఉద్దేశించి తీవ్రంగా హెచ్చరించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు న్యాయం చేసేందుకు భారత్ అన్నివిధాలా ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు. బీహార్ లోని మధుబనిలో గురువారం జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సాధారణంగా హిందీలో మాట్లాడే మోదీ ప్రపంచ దేశాలకు బలమైన సందేశం పంపేందుకు ఇక్కడ ఆంగ్లంలో ప్రసంగించారు. ‘దేశం మొత్తం ఉగ్రదాడిని ఖండించింది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతిఒక్కరూ మనతోపాటు నిలిచారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో కఠినంగా శిక్షిస్తామని దేశంలోని ప్రతి ఒక్కరికీ హామీనిస్తున్నా. ఈ దాడితో భారత్ మొత్తం దిగ్భ్రాంతిలో ఉంది.

ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కొడుకును కోల్పోయింది. ఓ సోదరి తన జీవిత భాగస్వామిని దూరం చేసుకుంది. బాధితుల్లో కొందరు బెంగాలీ, కన్నడ, మరాఠీ, ఒడియా మాట్లాడేవారున్నారు. ఈ దాడి కేవలం పర్యాటకుల మీద జరిగింది కాదు. దేశ ఆత్మపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులపై ప్రతీకారం కోసం చూస్తున్నారు.

ఉగ్రవాదానికి సంబంధించిన అవశేషాలు ఏమున్నా వాటిని నేలమట్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలోని 140 కోట్ల మంది ఆత్మస్థైర్యం ఉగ్రమూకల వెన్నముకలను విరిచేందుకు సిద్ధంగా ఉంది. ఈ కష్టకాలంలో భారత్‌కు మద్దతుగా నిలిచిన ప్రపంచదేశాల అధినేతలకు కృతజ్ఞతలు’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.

ఈనెల 22న జమ్మూలోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రమూకలు 26 మంది టెర్రరిస్టులను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి తమ పనే అని పాకిస్తాన్‌కు చెందిన లష్కరే అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ప్రకటించింది. ఈ దాడి సమయంలో సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తన పర్యటను కుదించుకుని హుటాహుటిన భారత్‌కు తిరిగివచ్చి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.