calender_icon.png 20 September, 2024 | 6:42 AM

లెబనాన్‌లో మళ్లీ అనూహ్య దాడులు

19-09-2024 02:11:29 AM

ఈసారి పేజర్లకు బదులు వాకీటాకీలు

100 మందికిపైగా గాయాలు

ఇజ్రాయెల్‌కు శిక్ష తప్పదని హిజ్బొల్లా హెచ్చరిక

పేజర్ల పేలుళ్లు పక్కా ప్రణాళికతోనే జరిగాయి

బ్యాటరీలకు పేలుడు పదార్థాలు అమర్చారు

సైబర్ దాడి ద్వారా పేల్చివేసి ఉంటారు

సైనిక నిపుణుల విశ్లేషణలు, న్యూయార్క్ పోస్ట్ వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: లెబనాన్‌లో పేజ ర్ల పేలుళ్లు మరిచిపోకముందే మరోమారు అనూహ్య దాడులు చోటుచేసుకున్నాయి. పేజర్ల ఘటన నుంచి తేరుకోకముందే తాజా గా వాకీటాకీలు పేలినట్లు తెలుస్తోంది. పేజర్ల పేలుళ్లలో మృతిచెందిన ముగ్గురు హిజ్బొల్లా సభ్యులు, ఓ చిన్నారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే బీరూట్‌లో తాజా పేలుళ్లు సంభవించడం గమనార్హం.

దీనిపై లెబనాన్ ఆరోగ్యశాఖ స్పందిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలాయని, ఈ ఘటనల్లో 100 మందికిపైగా గాయపడ్డారని ప్రకటించింది. ఈ పేలుళ్లను హిజ్బొల్లా సైతం అంగీకరించింది. వాకీటాకీలు పేలిపోవడం వల్లనే ఈ ఘటనలు జరిగాయని పేర్కొంది. లెబనాన్, సిరియాల్లో మంగళవారం ఒకేసారి వేలాది పేజర్లు పేలిపోగా ఈ ప్రమాదాల్లో 12 మంది మృతి చెందారు. మరో 2,800 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో లెబనాన్‌లోని ఇరాన్ రాయబారితో పాటు హిజ్బొల్లా కీలక నేతలు ఉన్నారు. ఈ చర్య ఇజ్రాయెల్ పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.     

పేలినవి కొత్త పేజర్లే

హిజ్బొల్లా వాడుతోన్న వేలాది పేజర్లు ఒక్కసారి పేలిపోవడంతో ప్రపంచం అవాక్కయింది. ఈ దాడి ఎలా జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నప్పటికీ పక్కా ప్రణాళికతోనే ఈ ఆపరేషన్ జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పేలిన పేజర్లలో అధిక శాతం కొత్తవే కావడం గమనార్హం. అంతేకాకుండా వీటిల్లో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను అమర్చినట్లు పేర్కొంటున్నారు. తైవాన్‌కు చెందిన ఓ సంస్థ పరికరాలను ఇజ్రాయెల్ దీనికోసం వాడినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది.

ఇటీవల తైవాన్‌కు చెందిన సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన దాదాపు 3 వేల కొత్త పేజర్లను లెబనాన్ దిగుమతి చేసుకుంది. వాటిలో అత్యధికంగా పీటూ మోడల్‌వే కాగా మరో మూడు మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ డివైజ్‌లలోనే పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ పేజర్లను తమ సంస్థ తయారు చేయలేదని గోల్డ్ అపోలో వెల్లడించింది. బుడాపెస్ట్‌లోని ఓ కంపెనీలో తయారయ్యాయని, వాటిపై ఒప్పందం ప్రకారం తమ కంపెనీ పేరు (ట్రేడ్ మార్క్) వాడటానికి మాత్రమే అనుమతి ఇచ్చామని ఆ ప్రకటనలో చెప్పింది. 

3 గ్రాముల పేలుడు పదార్థాలు

ఈ పేలుళ్ల వెనుక కచ్చితంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉందని హిజ్బొల్లా అనుమానిస్తోంది. నిఘా సంస్థ సభ్యులు మొత్తం ఆపరేషన్‌లో నేరుగా పాల్గొని ఉంటారని భావిస్తోంది. కాగా, కేవలం బ్యాటరీ పేలడం వల్ల ఈ స్థాయిలో గాయపడరని ఆర్మీ నిపుణులు చెబుతున్నారు. హిజ్బొల్లాకు సరఫరా చేసిన పేజర్లలో దాదాపు 3 గ్రాముల మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కనే అమర్చే అవకాశముందని యూరోపోల్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఈ పేజర్లలో శక్తిమంతమైన పెంటాఎరిత్రటాల్ ట్రైనైట్రేట్ అనే ప్లాస్టిక్ ఎక్స్‌ప్లోజివ్‌ను వాడే అవకాశముందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. దీన్ని సైనికులు, భవనాల కూల్చివేతలో వాడుతారు. బ్యాటరీ ఉష్ణోగ్రతను పెంచి కూడా ఈ పదార్థాన్ని పేల్చవచ్చు. పేలుళ్లకు ముందు పేజర్లు బాగా వేడెక్కి, సుదీర్ఘంగా బీప్ శబ్దం వచ్చిందని పేలుడు నుంచి సురక్షితంగా బయటపడ్డవారు చెబుతున్నారు. పేజర్ తయారీ లేదా సరఫరా వ్యవస్థలో మొస్సాద్ చొరబడి వీటిని అమర్చి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. సైబర్ దాడి ద్వారా బ్యాటరీలు వేడెక్కేలా చేసి పేల్చివేశారనే నిపుణులు చెబుతున్నారు.   

అసలేంటి పేజర్లు? ఎవరు వాడుతున్నారు?

సెల్‌ఫోన్లు అందుబాటులో లేని సమయంలో సమాచారం అందజేయడానికి పేజర్లను 20వ శతాబ్దంలో విరివిరిగా ఉపయోగించేవారు. ఫీచర్ ఫోన్ సైజులో ఉండే వీటి ద్వారా అవసరమైన వారికి మెస్సేజ్ చేయవచ్చు. ఇందులో ముందుగా ఎవరికి సందేశం అందించాలో పేజర్ సెంటర్‌కు కాల్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అక్కడి ప్రతినిధి సంబంధిత వ్యక్తి వద్ద ఉండే పేజర్‌కు మెస్సేజ్ పంపుతారు. దానిని చూసుకున్న వ్యక్తి అవసరమైతే టెలిఫోన్ ద్వారా కాల్ చేసి మాట్లాడుకునేవారు.

అయితే, సెల్‌ఫోన్ల రాకతో పేజర్ల వాడకం దాదాపు తగ్గిపోయింది. కాగా, గతేడాది గాజా యుద్ధం మొద లైనప్పటి నుంచి ఇజ్రాయె ల్ మొబైల్‌ల్లోకి చొరబడే అవకాశముందని, ఫోన్లను వాడొద్దని హిజ్బొల్లా తన క్యాడర్‌ను హెచ్చరించింది. దీంతో సెక్యురిటీ, ప్రైవసీ, విభిన్న ఫీచర్ల కారణంగా హిజ్బొల్లా సభ్యులంతా పేజర్లనే వాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇవి కూడా ఇజ్రాయెల్‌కు లక్ష్యంగా మారాయి. హిజ్బొల్లానే కాకుండా చాలా సున్నితమైన, కఠి నతరమైన ప్రాంతాల్లో వీటి వాడకం ఇప్పటికీ ఉంది. మొబైల్ సిగ్నళ్లు ఉండని మారు మూల ప్రాంతాలు, ఆసుపత్రుల్లో పేజర్లను వాడుతున్నారు.

కుట్ర బయటపడ్డ వెంటనే..

ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ చీఫ్‌ను హత్య చేసేందుకు హిజ్బొల్లా కుట్ర పన్నింది. ఈ కుట్రను ఛేదించిన ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్.. కొన్ని ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఈ కుట్ర బయటపడిన కొన్ని గంటల వ్యవధిలోనే లెబనాన్, సిరియాల్లో వేలాది పేజర్లు పేలిపోవడం గమనార్హం. అంతేకాకుండా ఈ పేలుళ్లలో హిజ్బొల్లా నాయకులు, సలహాదారులు గాయపడటం, అన్ని పేజర్లు దాదాపు ఒకే సమయంలో పేలడంతో ఇజ్రాయెల్ మీద అనుమానం బలపడుతోంది. అయితే, ఈ చర్యకు ఇజ్రాయెల్‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బొల్లా ప్రకటించింది. ఇది తమ అతిపెద్ద భద్రతా వైఫల్యమని, ఇజ్రాయెల్‌కు శిక్ష తప్పదని హెచ్చరించింది. ఈ క్రిమినల్ చర్యకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేస్తామని లెబనాన్ ప్రకటించింది.