19-04-2025 12:31:59 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: హిందువులు పవిత్ర గ్రంథంగా భావించే భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో చోటు లభించింది. దీంతో భారతీయ సంస్కృతి, తాత్విక వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించినట్లయింది. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయలు గర్వించదగ్గ క్షణమిది’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో చోటు దక్కిన విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో శ్రీమద్భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి స్థానం లభించింది. భారతదేశ జ్ఞాన సంపద, కళా ప్రతిభను ప్రపంచం గౌరవిస్తోంది.
ఈ రచనలు ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు’ అని షెకావత్ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది ప్రపంవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణం. గీత, న్యాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్‌లో చేర్చడం ద్వారా మన జ్ఞాన సంపద, గొప్ప సంస్కృతికి ప్రపంచ గుర్తింపు లభించిందన్నారు.