మెదక్ జిల్లాలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూమి
- ‘విరాసత్’ కోసం గిరిజన రైతుల ఎదురుచూపు
- జిల్లాలో 610 మందికి పోడు పట్టాలు
- ఆన్‌లైన్ లాగిన్ లేకపోవడంతో అవస్థలు
మెదక్, నవంబర్ 26 (విజయక్రాంతి): పోడు భూములను సాగు చేసుకుని జీవనం సాగించే గిరిజనులు వివిధ కారణాలతో చనిపోతే వారి వారసులకు హక్కులు రావడం లేదు. దీంతో రైతు భరోసా, బీమా, రుణమాఫీ తదితర పథకాలకు దూరమవుతు న్నారు. విరాసత్ (వారసత్వం) చేయాలని బాధితులు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఏళ్లతరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు.
చనిపోయిన వారి పేర్లతోనే పట్టా భూములు (ఆర్వోఎఫ్‌ఆర్) ఉండటం వల్ల పంట రుణాలు ఇవ్వలేమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రెవెన్యూ పట్టాలు కలిగిన గిరిజనుల భూములకు సైతం ఇదే సమస్య ఎదురవుతోంది. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) భూముల మ్యూటేషన్‌కు సంబంధించి ప్రత్యేక లాగిన్ ఇప్పటికీ లేకపోవడంతో విరాసత్‌లు సాధ్యపడటం లేదు.
జిల్లా గిరిజన సంక్షేమాధికారి కార్యాలయంలో రైతుల దరఖాస్తులు పేరుకుపోతు న్నాయి. మెదక్ జిల్లాలో 70వేలకు పైగా గిరిజన జనాభా ఉంది. జిల్లాలో 2023లో దాదాపు 524 ఎకరాల్లో పోడు పట్టాలు తీసుకున్న గిరిజన రైతులు 610 మంది వరకు ఉన్నారు.
2006లో పట్టాల అందజేత
ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సంబంధించి 2006లో అప్పటి ప్రభుత్వం పట్టాలు అందజేసింది. మళ్లీ 2023లో పోడు పట్టాలను సర్కార్ జారీ చేసింది. పట్టాదారు మృతి చెందిన అనంతరం వారసులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను అధికారులు వారి వద్ద ఉన్న వివరాలతో సరిచూసి, వారసుల పేర్ల మీద కొత్త పట్టా జారీచేయాలి.
కానీ ఈ ప్రక్రియ పెండింగ్‌లో పెట్టడంతో చాలామంది గిరిజన రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా వరకు పోడు భూములు అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్నవే. దీంతో రెవెన్యూ, ఫారెస్టు శాఖల మధ్య ఏళ్లతరబడి నెలకొన్న సరిహద్దుల వివాదం వల్ల పోడురైతులకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆర్వోఎఫ్‌ఆర్.. కేంద్రం ఆధీనంలో ఉండగా, అసైన్డ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడుతోంది.
అయితే విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కేవలం వారసత్వం సర్టిఫికెట్ మాత్రమే రెవెన్యూ శాఖ మంజూరు చేస్తోంది. కానీ రెండు శాఖల సరిహద్దు వివాదంతో విరాసత్ దరఖాస్తులను పెండింగ్ పెట్టాల్సి వస్తోందని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి ‘విజయక్రాంతి’తో వెల్లడించారు.
ఆన్‌లైన్ చేస్తే మేలు..
ధరణిలో ఏజెన్సీ భూములకు సంబంధించి ప్రత్యేక లాగిన్ రూపొందించాలి. విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలను ఆన్‌లైన్ ద్వారా తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీవో, ఐటీడీఏ లాగిన్‌కు చేరాలి. ప్రతి 15 రోజులకోసారి పెండింగ్ వాటిపై సంబంధిత అధికారులు దృష్టి సారిస్తే విరాసత్‌ల కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించే బాధ గిరిజన రైతులకు తప్పుతుంది.
లాగిన్ సమస్య ఉంది
ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలకు సంబంధించి విరాసత్‌ల కోసం అనేక మంది రైతులు వస్తున్నారు. ఐటీడీఏ లాగిన్ సమస్య ఉండటం వల్ల సంబంధీకులకు పట్టాల జారీలో జాప్యం ఏర్పడుతోంది. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాక క్షేత్రస్థాయిలో విచారించి అర్హులకు పట్టాలు జారీచేస్తారు.
నీలిమ, జిల్లా గిరిజన
సంక్షేమాధికారి, మెదక్