- గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు
- డిసెంబర్ 1 నుంచి 9 వరకు వరుసగా వేడుకలు
- 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- మహబూబ్‌నగర్‌లో ౩౦న రైతు సదస్సు
- అధికారుల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ర్ట స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని చెప్పారు.
డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో -విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం సమీక్షించారు.
ఈ విజయోత్సావాల్లో అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని సూచించారు. మొదటి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 19న వరంగల్‌లో మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని, ఈ సందర్భంగా అధికారులను సీఎం అభినందించారు.
అదే ఉత్సాహంతో ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసే రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 28 నుంచే రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని, వారికి అవసరమైన ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా తొలి ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలని నిర్ణయించారు. ఆ వేదిక మీదనే గ్రూప్ పలు రిక్రూట్‌మెంట్లలో ఎంపికైన ౯ వేల మందికి నియామక పత్రాలు అందించనున్నట్టు చెప్పారు.
డిసెంబర్ 1 నుంచి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
డిసెంబర్ 1 నుంచి శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. వాటితోపాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఈ వారం రోజుల్లోనే జరిగేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. శాఖల వారీగా రోజుకో మంత్రి తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతోపాటు భవిష్యత్తు ప్రణాళికను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని చెప్పారు.
వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో రాష్ర్టమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. ఈ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని సెక్రెటేరియట్ పరిసరాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వాములను చేయాలని కోరారు.
రాష్ర్టంలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు జరిగేలా చూడాలని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సెక్రెటేరియట్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌పై ఉత్సవాలు జరిగేందుకు వీలుగా వాహనాలను దారి మళ్లించాలని సూచించారు.
9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
డిసెంబర్ 9న సచివాలయ ముఖద్వారం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. ఆ రోజు సాయంత్రం జరిగే వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఆహ్వానించాలని నిర్ణయించారు.
నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి, లక్ష మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్గించేలా సదస్సు
మహబూబ్‌నగర్ రైతు సదస్సు బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించేలా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. అధునాతన సాగు పద్ధతులు, మెలకువలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్థక శాఖల అధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్‌పామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, రైతులకు అందుబాటులోకి వచ్చిన వివిధ కంపెనీ వినూత్న ఉత్పాదనలన్నీ స్టాళ్లల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించేలా మూడు రోజుల పాటు పాలమూరులో రైతు సదస్సు నిర్వహించాలని కోరారు. 28వ తేదీ నుంచే ఈ స్టాళ్లను అందుబాటులోకి తేవాలని సూచించారు.
హైదరాబాద్‌కు గోదావరి జలాలు
- కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి మళ్లింపు
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 20 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించనన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సమీక్షించారు.
కొండపోచమ్మ , మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపుపైన సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుంది.. నీటి లభ్యత పైన పూర్తి అధ్యయనం చేయాలని సూచించారు.
డిసెంబర్ 1 తేదీ వరకు టెండర్లకు వెళ్లాలని, ఈ దిశగా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. దీనిపై మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమీక్షలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ప్రశాంత్ జె. పాటిల్, అధికారులు పాల్గొన్నారు.