calender_icon.png 11 January, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎనిమిది నెలల గరిష్ఠానికి నిరుద్యోగం

05-07-2024 02:09:27 AM

జూన్‌లో 9.2 శాతానికి చేరిక: సీఎంఐఈ

ముంబై, జూలై 4: దేశంలో నిరుద్యోగం ఎనిమిది నెలల గరిష్ఠానికి పెరిగింది. 2024 జూన్ నెలలో నిరుద్యోగం రేటు 9.2 శాతానికి చేరినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గురువారం వెల్లడించింది. అంతక్రితం మే నెలలో ఈ రేటు 7 శాతంగా నమోదయ్యింది. నిరుద్యోగులుగా ఉంటూ ఉపాధి కోసం అన్వేషిస్తున్నవారి సంఖ్యను సీఎంఐఈ నిర్వహించే సర్వే ద్వారా ఈ రేటును వెల్లడిస్తుంది. ఈ జూన్ నెలలో మహిళా నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ రేటు 18.5 శాతానికి చేరినట్టు సీఎంఐఈ తెలిపింది.

మే నెలలో ఈ రేటు 15.1 శాతం వద్ద ఉంది. పురుషుల నిరుద్యోగం రేటు 7.7 శాతం నుంచి 7.8 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం అధికంగా ప్రబలింది. ఇది జూన్‌లో 6.3 శాతం నుంచి 9.3 శాతానికి చేరింది. గ్రామాల్లో పురుషుల నిరుద్యోం రేటు 5.4 శాత ం నుంచి 8.2 శాతానికి, మహిళల నిరుద్యోగం రేటు 12 శాతం నుంచి 17.1 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 8.6 శాతం నుంచి 8.9 శాతానికి చేరింది. పట్టణాల్లో కూడా మహిళల నిరుద్యోగం బాగా పెరిగింది. ఈ ప్రాంతాల్లో 18.53 శాతం నుంచి 21.36 శాతానికి చేరింది.