02-04-2025 12:00:00 AM
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 01 :(విజయక్రాంతి) నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలలోని ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ ప్రజా పాలన సేవా కేంద్రాలలో నేరుగా దరఖాస్తులు అందించవచ్చని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల నిరుద్యోగ యువత ఈ పథకం కింద దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను అన్ని ప్రజా పాలన సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచామని అన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను కుల, ఆదాయ ధృవీకరణ, ఆధార్, పాన్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఫోన్ నెంబర్ ను జత చేసి ప్రజా పాలన సేవా కేంద్రాలలో అందించాలని కలెక్టర్ సూచించారు.
ఇదివరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం ఆఫ్ లైన్ విధానంలోనూ నేరుగా దరఖాస్తులు అందించేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని అన్నారు. అన్ని ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఖాళీ దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, సరైన విధంగా దరఖాస్తులు చేసుకునేలా సిబ్బంది సహకారం అందిస్తారని అన్నారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్ణీత గడువు లోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కాగా, ఇప్పటికే ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తులు అందించాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.