18-03-2025 07:46:26 PM
తెలంగాణ రాష్ట్ర బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్...
ముషీరాబాద్ (విజయక్రాంతి): యువ వికాస పథకాన్ని ఉపయోగించుకుని యువత ఉపాధి కల్పించుకోవాలని బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరుద్యోగ యువతకు వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలని చేస్తున్న కృషిలో భాగంగా 'రాజీవ్ యువ వికాసం' అనే వినూత్న కార్యక్రమాన్ని అమల్లోకి తేవడం హర్షణీయం అని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి రాజీవ్ యువ వికాస్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పథకం కింద నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ రుణం మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్ నెంబర్, పాస్పోర్ట్ ఫోటో మొబైల్ నెంబర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగులకు, యువ వికాసానికి మార్చి 17 నుండి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 6 నుండి 30 వరకు లబ్ధిదారుల ఎంపిక యూనిట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. క్యాటగిరి 1లో లక్ష వరకు రుణం 80 శాతం రాయితీ, క్యాటగిరి రెండులో రెండు లక్షల వరకు సహాయం 70 శాతం రాయితీ, మూడవ కేటగిరిలో మూడు లక్షల వరకు సహాయం 60 శాతం రాయితీ, కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో టిపిసిసి ఓబిసి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంటి విక్రమ్ యాదవ్, ఓబీసీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ దేశ బోయిన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.