calender_icon.png 28 November, 2024 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు బ్యాంకుగా నిరుద్యోగులు

29-10-2024 03:07:11 AM

ఎమ్మెల్సీగా గెలిపిస్తే  సమస్యలు పరిష్కరిస్తా 

పట్టభద్రుల ఎమ్మెల్సీ  అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 

గజ్వేల్/కరీంనగర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాజకీయ నిరుద్యోగులకు శాసన మండలి పునరావాస కేంద్రంగా మారిందని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. గజ్వేల్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా  విధులు నిర్వహిస్తున్న ప్రసన్న హరికృష్ణ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున సోమవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలకు పైగా తాను విద్యాబోధన చేసినట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోయారని, నిరుద్యోగులను రాజకీయ నాయకులు ఓటుబ్యాంక్‌గా పరిగణిస్తున్నారే తప్ప వారి సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం కృషి చేయడం లేదని అన్నారు. రాజకీయ నిరుద్యోగులంతా శాసనమండలిని పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారని, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. లెక్చరర్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన తనకు నిరుద్యోగుల సమస్యల గురించి, విద్యావ్యవస్థలో లోటుపాట్ల గురించి తెలుసని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.

అనంతరం కరీంనగర్ జిల్లా శివారు అయిన రేణికుంట టోల్‌గేట్ నుంచి కరీంనగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. తనను గెలిపిస్తే చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రకటించారు. కాగా, హరికృష్ణ ఇంకా 19 సంవత్సరాల సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు.