calender_icon.png 27 December, 2024 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారులకు దక్కని గౌరవం!

01-08-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమాల్లో నల్లగొండ జిల్లా పాత్ర అనిర్వచనీయం. ఎంతో మంది కవులు, కళాకారులు, విద్యావంతులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పోరాటంలో భాగస్వాములై ఉద్యమాన్ని ముందుండి నడిపారు. రాష్ట్రం కోసం ఉవ్వెత్తున సాగుతున్న మలిదశ ఉద్యమ సమయంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జేఏసీ సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. పట్టణంలోని సీతరాంపురం ప్రాంతానికి చెందిన న్యాయవాది అన్నభీమోజు నాగార్జునచారి. తెలంగాణ వచ్చేంత వరకు తాను నల్లకోటు వేయనంటూ ప్రతినబూని పద్నాలుగేండ్ల పాటు ప్రాణంగా ప్రేమించే వృత్తిని పక్కన పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం అలుపెరగని పోరాటం చేశారు. 

తెలంగాణలోని అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలు, రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమంలో భాగస్వామ్యం చేసేందుకు 2009 డిసెంబర్ 24న కోదండరాం చైర్మన్‌గా టీజేఏసీ ఏర్పాటైంది. మిర్యాలగూడలో జేఏసీ ఏర్పాటు చేసి అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కోదండరాంతో పట్టణంలో 2010 మార్చిలో తొలి సమావేశం ఏర్పాటు చేయించారు నాగార్జునచారి. ఆ తరువాత ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నాయకులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమంలో భాగంగా చేపట్టిన ప్రతి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

దాంతో నియోజకవర్గంలో తెలంగాణ వాదుల నుంచి ఆయనకు మద్దతు పెరిగింది. రాజకీయ జేఏసీ చైర్మన్ మాలి ధర్మపాల్‌రెడ్డితో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ చైర్మన్లు వరప్రసాదరావు, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌బాబు తదితరులతో కలిసి రోజుకో గ్రామం తిరుగుతూ కూడళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ భావజాలాన్ని విస్తరింపజేశారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సి టీల ప్రొఫెసర్లతో పాటు తెలంగాణ వాదులు, మేధావులు, వక్తల సాయంతో కళాశాల విద్యార్థులను ఉద్యమం వైపు తీసుకొచ్చి మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఉద్యమానికి అడ్డగా మార్చారు. 

కేసీఆర్ పాదయాత్రతో..

నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు సాగు నీరు ఇవ్వాలని, ఎత్తిపోతలను (లిఫ్టులు) ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమ నేత కేసీఆర్ 2003 ఆగస్టు 26న తెలంగాణఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్రకు పిలుపునిచ్చారు. హుజూర్‌నగర్, గరిడేపల్లి, చిల్లేపల్లి, మిర్యాలగూడ నుంచి నిడమనూరు మీదుగా హాలియాకు మూడు రోజులపాటు పాదయాత్ర కొనసాగింది. హాలియాలో జరిగిన సభకు నాటి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తిప్పన విజయసింహారెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడి హోదాలో నాగార్జునచారి నేతృత్వం వహించారు.

ఆ సభలో దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి పాలకులు చేస్తున్న అన్యాయం, సామాజిక, సాంస్కృతిక విధ్వంసాన్ని కేసీఆర్ ప్రజలకు వివరించారు. ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయకపోతే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడం తథ్యమని నాటి ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో సర్కారు దిగివచ్చి వెంటనే నీటిని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ పాదయాత్ర తొలి అడుగని ఉద్యమకారులు చెబుతుంటారు. ఇలాంటి పాదయాత్రను విజయవంతం చేయడంలో నాగార్జున చారి కీలకంగా వ్యవహరించారు. 

ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు..

తెలంగాణ ఉద్యమకారుడిగా మిర్యాలగూడ నియోజకవర్గంతో పాటు ఉద్యమ నేత కేసీఆర్ వద్ద సైతం అన్నభీమోజు నాగార్జునచారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉద్యమ సమయంలో ఎంతమందిలో నిలబడినా గుర్తించి ‘ఏం చారి.. ఎలా ఉన్నారు అంటూ’ కేసీఆర్ ఆప్యాయంగా పలికరించేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా చాలాసార్లు కేసీఆర్‌ను కలిశారు. హరీశ్‌రావు, కేటీఆర్‌తోపాటు నాటి ఉద్యమ నేతలంతా చారి ఇంటికి వచ్చి వెళ్లారు.

 రామ్మూర్తి చల్లా, నల్లగొండ, విజయక్రాంతి

వరంగల్ హైవేపై అరెస్ట్..

2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా మిర్యాలగూడలో తనతోపాటు తెలంగాణ వాదులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఉద్యమంలో భాగంగా వరంగల్ హైవే దిగ్బంధంలో సిద్దిపేట చౌరస్తాకు ఇన్‌చార్జిగా వ్యవహరించి అరెస్టయ్యారు. 2011లో చేపట్టిన మిలియన్ మార్చ్ ఆ తరువాత అదే ఏడాదిలో జరిగిన పల్లెపల్లె పట్టాలపైకి కార్యక్రమంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. 2012లో జరిగిన తెలంగాణ మార్చ్, సడక్ బంద్, సకల జనుల సమ్మె, వంటావార్పు తదితర కార్యక్రమాలను మిర్యాలగూడ నియోజకవర్గంలో ముందుండి నడిపారు. నాగార్జునచారి తండ్రి జనార్దనచారిసైతం తొలిదశ  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తాత మదనాచారికి రాజకీయ నేపథ్యం ఉండడంతో ఆ ప్రభావం నాగార్జున చారిపై పడింది. విద్యార్థి దశ నుంచే సమైక్య పాలకులకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు.   

ఉద్యమకారులకు న్యాయం జరగలేదు..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా 14 ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసిన ఉద్యమకారులకు స్వరాష్ట్రంలో న్యాయం జరగలేదు. ఉద్యమ నేత కేసీఆర్ అవకాశవాద, వలసవాద నాయకులకు అవకాశాలిచ్చి సిసలైన ఉద్యమ కారులకు అన్యాయం చేశారు. ఇప్పటికీ కేసీఆర్‌కు అండగా ఉన్నది ఉద్యమకారులే.  ఈ విషయాన్ని ఆయన గ్రహించాలి. పదవుల కోసం ఉద్యమం చేయలేదు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు మాలాంటి వాళ్లం పోరాడాం. 

 అన్నభీమోజు నాగార్జునా చారి, తెలంగాణ ఉద్యమకారుడు