calender_icon.png 25 October, 2024 | 12:56 AM

అండర్‌వరల్డ్ టెర్రర్

15-10-2024 12:00:00 AM

మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్దిఖీ హత్య  రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శనివారం రాత్రి తన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కార్యాలయం వద్ద ఉండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపి దారుణంగా హత్యచేశారు. తీవ్రంగా గాయపడిన సిద్ఖిఖీని లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిఖీకి ప్రాణ హాని ఉందన్న సమాచారంతో 15 రోజుల క్రితమే ఆయన భద్రతను వై కేటగిరీకి పెంచారు. కాగా సిద్దిఖీని తామే చంపినట్లు ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వర్గం ప్రకటించడంతో ఈ హత్య మరో మలుపు తిరిగింది.

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు సన్నిహితంగా ఎవరు ఉన్నా ఇదే గతి పడుతుందని కూడా ఫేస్‌బుక్ పోస్టులో ఆ గ్యాంగ్ హెచ్చరించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కూడా భారీ భద్రత కల్పించారు. వాస్తవానికి బాబా సిద్దిఖీ, ఆయన కుమారుడు జీషన్ సిద్దిఖీ ఇద్దరూ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్‌లిస్టులో ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడయింది.

తండ్రీ, కుమారుల్లో ఎవరు దొరికితే వారిని చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు పట్టుబడిన షూటర్లు వెల్లడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హత్యకు కొన్ని నెలల ముందునుంచే సిద్ధిఖీ నివాసం సహా ఇతర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు కాల్పులు జరిపిన కర్నైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్‌లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు విషయంలో తలెత్తిన విభేదాలే హత్యకు కారణమయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్దిఖీ ఎంహెచ్‌డీఏ చైర్మన్‌గా ఉన్నప్పుడు చేపట్టిన ఈ ప్రాజెక్టులో వేలకోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు సమాచారం. కేసుకు సంబంధించి రూ.462 కోట్ల విలువైన సిద్దిఖీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది కూడా.

ఈ హత్యతో గతంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తరహాలో ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తయారైందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు.లారెన్స్ బిష్ణోయ్ ముఠాను కెనడా పోలీసులు, భారతీయ ఏజన్సీల వాంటెడ్ క్రిమినల్ గోల్డీబ్రార్ నడుపుతున్నాడు. 

ఒకప్పుడు పంజాబ్‌కే పరిమితమైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆ తర్వా త క్రమంగా 11 రాష్ట్రాలకు విస్తరించింది. ఈ గ్యాంగ్‌లో దాదాపు 700 మంది షూటర్లు ఉన్నట్లు చెబుతారు. వీరిలో 300 మందికి పంజాబ్‌తో సంబంధాలున్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీబ్రార్ సహా 16 మందిపై యూఏపిఏ చట్టం కింద చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ‘డి  కంపెనీ’(దావూద్ గ్యాంగ్)తో పోల్చడం విశేషం.మహారాష్ట్రలో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ జరిగిన బాబా సిద్దిఖీ  హత్య రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

సంకీ ర్ణ రాష్ట్రప్రభుత్వంలో భాగస్వామి అయిన అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత కావడంతో ఇది రాజకీయంగా మరింత దుమారం రేపుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువైనాయని చెప్పడానికి సిద్దిఖీ హత్యే నిదర్శనం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేసిన బాబా సిద్దిఖీకి ముస్లిం వర్గాల్లో మంచి పలుకుబడి ఉంది. బాలీవుడ్‌లో ముఖ్యం గా షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయి. వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్‌ను సైతం సిద్దిఖీయే పరిష్కరించినట్లు చెప్తారు.

కొవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు పెద్ద ఎత్తున మందులు చేసినందుకు ప్రశంసలు కూడా అందుకున్నా రు. భారీ స్థాయిలో ఇఫ్తార్ పార్టీలు ఇచ్చే వారు. ఆయన అంతిమ యాత్ర సమయంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరు కావడాన్ని బట్టే ఆ రంగంతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు అర్థమవుతాయి. ఎన్నికల వేళ జరిగిన ఈ హత్య ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న భయాలను రేకెత్తిస్తోంది.