calender_icon.png 2 January, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూసుకుంట గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టండి

30-12-2024 10:42:52 PM

అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్... 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట గ్రామంలో నివసిస్తున్న కొండరెడ్ల గిరిజనులకు మౌలిక వసతులు కరెంటు, రోడ్డు, వ్యవసాయానికి సంబంధించిన పనులు ఫారెస్ట్ క్లియరెన్స్ కొరకు ప్రతిపాదనలు పంపినందున, ఆ గ్రామాలలోని గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోని పనులు ప్రారంభించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. సోమవారం నాడు తన చాంబర్లో హార్టికల్చర్, అగ్రికల్చర్, కరెంటు, ఫారెస్ట్ అధికారులతో ఆ గ్రామంలో కల్పించవలసిన మౌలిక వసతుల గురించి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, చేనేత మార్కెటింగ్ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సందర్భంగా గ్రామస్తులు కోరిన విధంగా రోడ్డు సౌకర్యం, పంటలు పండించుకోవడానికి కరెంటు సౌకర్యం, బోర్లు వేయడానికి ప్రతిపాదించినందున తప్పనిసరిగా రోడ్డు క్లియరెన్స్ కి ప్రతిపాదనలు సమర్పించినందున ఆర్ అండ్ బి అధికారులు ఈనెల 31 నుండి రోడ్డు పనులు గ్రామంలో నుండి ప్రారంభించాలని, కల్వర్టులు సంబంధించిన పనులు కూడా ప్రారంభి రెండు నెలల్లో పూర్తి చేయాలని అన్నారు. అలాగే ఆ గ్రామంలో నీటి వసతి కొరకు తప్పనిసరిగా బోర్లు, కరెంట్ సరఫరా గ్రౌండ్ వాటర్, విద్యుత్ శాఖ అధికారులు జాయింట్ గా సర్వే చేసి జనవరి 20 వరకు బోర్లు, విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని, ప్రస్తుతం ఉన్న పాత బోర్లు ఏమైనా చెడిపోయి ఉంటే వాటి స్థానంలో రైతులందరికీ సరిపడే విధంగా 14 బోర్లు వేయించాలని అన్నారు.

అవసరమైతే సోలార్ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడానికి కూడా ప్రయత్నించాలని అన్నారు. బోర్లు, కరెంటు సరఫరా అయిన వెంటనే ఐటీడీఏ ద్వారా హార్టికల్చర్, వ్యవసాయం చేసుకునే 20 మంది రైతులకు ఐటీడీఏ ద్వారా మోటార్లు అందిస్తామని, కరెంట్ సరఫరా చేయడానికి సబ్సిడీ 70% ఉన్నందున మిగతా 30 శాతం ఐటీడీఏ ద్వారా చెల్లించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, బోరు, కరెంటు సౌకర్యం కలగగానే తమ పొలాల్లో కనీసం రెండు లక్షల ఆయిల్ ఫామ్ చెట్లు వేయించి, అంతర్ పంటలుగా జొన్న, కొండజొన్నలు, బొబ్బర్లు, పొలం గట్ల వెంట వెదురు వేసుకునేలా వ్యవసాయ అధికారులు వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని, మునగ చెట్లు, ఇతర పండ్లకు సంబంధించిన చెట్లు వేసే విధంగా సూచించాలని అన్నారు. అధికారులందరూ సమన్వయంతో మంత్రివర్యులు చెప్పిన విధంగా వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, కరెంటు ఎస్సీ మహేందర్ రెడ్డి, ఏడి వెంకటరత్నం, జిల్లా ఉద్యానవన అధికారి కిషోర్, డీఎవో బాపూరావు తదితరులు పాల్గొన్నారు.