- సీఎండీలు మొదలు ఎస్‌ఈల వరకు క్షేత్రస్థాయికి
- జనవరి 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు కార్యక్రమాలు
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశం
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): వేసవిలో అవాంతరాలు లేకుండా, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అధికారులు ప్రణాళికతో ముందుకెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు సీఎండీలు మొదలుకొని ఎస్‌ఈ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బందికి వేసవిలో విద్యుత్ సరఫరాపై అవగాహన కల్పించాలని సూచించారు.
శుక్రవారం ప్రజాభవన్‌లో విద్యుత్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి ప్రణాళికను సమర్థవంత అమలుకు ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది కార్యాచరణ ప్రారంభించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. జనవరి 27న నోడల్ అధి కారులు క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి షెడ్యూల్‌ను వెల్లడించి విస్తృతంగా ప్రచారం చేయాలని భట్టి పేర్కొన్నారు.
జనవరి 29న నోడల్ అధికారులు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో కలిసి జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో వేసవి కార్యాచరణపై సమీక్షలు నిర్వహించాలన్నారు. ఫిబ్రవరి 4న ఎస్‌ఈలు డివిజన్ స్థాయిలో పూర్తి సిబ్బందితో కలిసి సమర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి పాల్గొన్నారు.