calender_icon.png 25 October, 2024 | 12:01 AM

పిల్లలకు బొమ్మరిల్లు ఇష్టం!

01-06-2024 12:05:00 AM

అంటోంది మహానిర్వాణ తంత్రం. నాలుగేళ్ళ వరకూ పిల్లల్ని ఆలనగా, పాలనగా చూసుకోవాలి, తర్వాత పదహారేళ్ళ వయసులో పిల్లలకు ఉన్నతమైన పౌరులుగా ఎదిగే విద్యను నేర్పాలి. ఆధునిక మానసిక వైద్యనిపుణులు కూడా అయిదేళ్ళ వరకూ బాల్యావస్థ చాలా ప్రముఖమైందని చెబుతున్నారు. వారిలో మానసికంగా, శారీరకంగా ఆ వయసులో రూపుదిద్దుకునే కొన్ని లక్షణాలు జీవితాంతం వారి వెన్నంటే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. పిల్లల ముందు అనుచితంగా, అసందర్భంగా ప్రవర్తించకూడదు. జీతానికే తప్ప జీవితానికి పనికిరాని చదువుల కోసం పిల్లల్ని పీల్చిపిప్పి చేయకుండా, ముందు వారి అభిరుచులను గుర్తించి మార్గదర్శనం చేయాలి.

“మొత్తం మీరే చేశారు నాన్న”అని సిద్దార్ధలా పిల్లాడు తండ్రి పట్ల బాధ పడే సందర్బం రాకూడదు.  పిల్లలని రోజు గమనిస్తారు కనుక వాళ్లు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో గుర్తించండి. అప్పుడు అందులో చేర్పించడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ డబ్బు, సమయం వృధా అవ్వదు. పైగా పిల్లలు ఇష్టంగా కూడా నేర్చుకుంటారు.

కొత్త యుగంలో కొత్త భావనలు, కల్పనలు చేసుకోగల అవకాశాన్ని మన పిల్లలకి ఇస్తున్నామా? లేదు. చెప్పులు వేసుకోవడం, బెల్ట్  పెట్టుకోవడం ఇష్టంలేని పిల్లలు వున్నారు. అంతమాత్రానికే ఆ తండ్రికి పరువు నష్టమా? పిల్లకి పరికిణీయే కుట్టించాలి. లోలకులే చేయించాలని వాళ్లమ్మ అనుకుంటుంది. ఆ పిల్లకీ ఇష్టాయిష్టాలుంటాయిగా! మన చిన్నతనంలో మన ఇష్టాయిష్టాలు పట్టించుకున్నదెవరు? అప్పుడు మనం బానిసల్లా వున్నాం కనుక మన పిల్లలు కూడా మనకి బానిసల్లా వుండి శిక్ష అనుభవించాల్సిందేనా? తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలకి పిల్లలే ప్రతీకలా? చూడబోతే అలాగే వుంది. పిల్లలకి తమ పరువు అనేది వుంటుందా? పెళ్లికి వెళ్లారనుకోండి, ఆ సందర్భానికి తగ్గట్టు పిల్లలు దుస్తులు వేసుకోకపోతే పెద్దల పరువేగా పోయేది? అందుకే ఎప్పుడెలాంటి బట్టలు వేసుకోవాలో పెద్దలే నిర్ణయించాలి. తల్లిదండ్రుల అహాన్ని సంతుష్టపరిచే సాధనాలు పిల్లలు. వారికి ఆలోచనలూ, కోరికలు ఏమిటి? రంగులు, రుచులు వాళ్లకేం తెలుసు?

“సర్వత్ర జయం ఇచ్ఛేత్, పుత్రాత్ ఇచ్ఛేత్ పరాజయం” అంటోంది మన సనాతన ధర్మం. ప్రతి చోటా జయాన్నే కోరుకుంటాం.  కానీ బిడ్డల చేతిలో పరాజయాన్ని ఆశిస్తాం. ఇంత విశాలంగా పిల్లల్ని పెంచితే, భవిష్యత్తులో వారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. మన ఘనమైన వారసత్వాన్ని నిరంతరం చిన్నారులకు గుర్తు చేస్తూ ఉండాలి. భౌతికమైన తాపత్రయాల నుంచి పిల్లల్ని జ్ఞానతృష్ణ వైపు పరుగులు తీయించాలి. అగ్గిపుల్లలో ప్రజ్వలన దాగి ఉన్నట్లు, మీలో అనంతమైన శక్తి నిగూఢంగా ఉందని వారికి స్పష్టం చేయండి.

ఈ విషయంలో మన పెద్దవాళ్ళెప్పుడో ‘రాజవత్ పంచవర్షాణి’ అని చెప్పారు. దాని ప్రకారం ఐదేళ్ళొచ్చే వరకూ పిల్లల్ని ప్రభువుల మాదిరి సకలోపచారాలతో తల్లితండ్రులు సంతోషపెట్టాలట. ఆ తరువాతే చదువు.  ఇప్పుడది పోయింది.  మూడో ఏడు కూడా రాకుండానే పిల్లల్ని కాన్వెంట్ బళ్ళకు, కార్పొరేట్ స్కూళ్ళకు తోలుతున్నాం. బుద్ధి వికాసానికి ఏమాత్రం అవకాశం లేని లేత వయసులో ఉన్న పసికూనల మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం. దాంతో చాలా మంది పిల్లలు తరువాతి కాలంలో బుద్ధిహీనులుగా, మరమనుష్యులుగా, మూర్ఖులుగా, హింసావాదులుగా తయారవుతున్నారు. ఇవేవీ కానివాళ్ళు- లేదా ఇవన్నీ కలిసిన వాళ్ళు విలువలతో నిమిత్తం లేకుండా కేవలం డబ్బు పోగేసే యంత్రాలవుతున్నారు.

కనుక తల్లితండ్రులందరూ ఈ విషయాన్ని గురించి బాగా ఆలోచించాలి. పసి పిల్లలతో మనం ఎంత ఎక్కువసేపు గడపగలిగితే అంత గా వాళ్ళు మన ప్రేమను ఆస్వాదించ గలుగుతారు. మనకు చేరువవుతారు. మనకు మాలిమి అవుతారు. అదే అదను. ఆ సమయంలోనే వాళ్ళకు మనం మంచి బుద్ధుల్నీ, విలువల్నీ బోధించాలి. వాటి ఆధారంగానే వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. బిడ్డల పెంపకంలో తండ్రిది గురుతరమైన బాధ్యత. అయితే అంతకంటే మహత్తరమైన బాధ్యత తల్లిది. తల్లిని మించిన నేర్పరి, శిక్షకురాలు ఎవరుంటారు? 

మరో కోణం

సూర్య కిరణాలు, చల్లటిగాలి ఈ రెండూ పిల్లలకి నేస్తాలే. హాయిగా మట్టిలోనూ  అలా ఎండకీ, గాలికీ తిరిగి ఆడితే జ్వరాలు రావు? మట్టిలో ఆడితే బట్టలు పాడైపోవూ? నీళ్లలో ఆడితే జలుబు చేస్తుంది. ఇవండీ మన ఆలోచనలు! పరుపుమీద ఎక్కి ఆడుకుంటే “పాడ వుతుంది. మంచి బట్టలు వేసుకుని ఆటలకి వెడితే ఎలా అవి పాడవుతాయి. ఇదండీ న్యాయం మనకయితే ఒక నియమం, పిల్లలైతే మరొకటీనా! ఆడుకోవటం ఇష్టమా, నీ బట్టలు పాడవకుండా కాపాడుకోవడం ఇష్ట మా అని పిల్లల్ని ఎప్పుడైనా అడిగిచూడండి, ముఖంమీద కొట్టినట్లు జవాబు వస్తుంది. 

ప్రకృతితో సహవాసం పిల్లల జీవితాలపైన మంచి ప్రభావాన్ని చూపుతుంది. భూమి స్పర్శ పిల్లలకి ఎంతటి ఆనందాన్నిస్తుందో ఎవరికైనా తెలుసా? పిల్లల వెనుక పరుగెత్తి చూశారా ఎప్పుడైనా? గంధం పూతలకన్నా మట్టి, ధూళి అంటేనే వారికి మక్కువ. మన ముద్దులకన్నా చల్లగాలే ఇష్టం. మన కౌగిళ్లకన్నా సూర్యుడి వెచ్చని కిరణాలే వారికి ప్రీతికరం. మన దృష్టికి ఏదీ కనిపించనిచోట  వారికి ఏదో అద్భుతమైనది కనిపిస్తుంది. కప్పల్ని చూసి గెంతుతారు, తూనీగలతో ఎగురుదామని ప్రయత్నిస్తారు, గుర్రంలా సకి లించబోతారు, తువ్వాయిలతో పరుగులు తీస్తారు. ఇక పువ్వుల సంగతో? పిల్లలకి అంత ఆప్తులైన మిత్రులు మరెవ్వరూ లేరు. పువ్వుల్ని చూస్తే చాలు కేరింతలు కొడతారు. ముగ్ధు లైపోయి వాటితో ఆడుకుంటారు. 

చందమామని చూసి వాళ్లు సంతోషించనిదెప్పుడు? రాత్రే ఎందుకు కనిపించాలి. పగలంతా చందమామ ఎక్కడ వుంటుంది అని వాళ్లు ఆలోచిస్తారు. చంద మామ నుంచే వాళ్లు దోబూచులాట నేర్చుకుంటారేమో? ఏడుస్తున్న పిల్లలకి చందమామని చూపించేగా ఊరుకోబెడతారు. వెన్నెల్లో చంద్రుడిని చూపిస్తూ బువ్వ తినిపిస్తారు. ప్రకృతిపట్ల వారికున్న ప్రేమ. అందుకే వారికి జానపద కథలు నచ్చుతాయి. అద్భుతాలే వారికి ఇష్టం. అయితే ప్రకృతిని ఆస్వాదించనివ్వకుండా పిల్లలని దానికి దూరం చేస్తే పెద్దయ్యాక వారిలో ఎవరైనా అసలైన కవిత్వం రాయగలరా? చిత్రకారులవ్వగలరా? పరవశించి పాడగలరా? 

పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వగానే పిల్లలకు వేసవి శిబిరాలంటూ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. -ఈ మధ్యకాలంలో వేసవి శిబిరాలకు గిరాకీ బాగానే పెరిగింది. కొన్ని సంస్థలు నిర్వహిస్తున్న వేసవి శిబిరాలలో ప్రవేశం దొరకడమే గగనమైపోతోంది. ఇంతకీ వేసవి శిబిరాలకు ఎందుకు ఇంత గిరాకీ? పిల్లలు నీతివాక్యాలు, విలువల పాఠాలు, వికాస సూత్రాలు నేర్చుకుంటారనా? అది నిజమే! కానీ అధికశాతం మంది తల్లితండ్రుల నుండి వచ్చిన సమాధానం మాత్రం ‘అబ్బా! పిల్లలతో వేగలేక పోతున్నాం. శిబిరాల్లో పడేస్తే మాకు కాస్త మనశ్శాంతి దొరుకుతుంది’ అని.   తల్లితండ్రుల అభిప్రాయంలో కొంత నిజం లేకపో లేదు. చిచ్చరపిడుగుల్లాంటి పిల్లల్ని కట్టడిచేయడం కత్తి మీద సామే  పిల్లల్లో మేధోవికా సాన్నీ, వృత్తి నైపుణ్యాన్నీ పెంచడానికి తోడ్పడతాయి. కానీ మనో వికాసానికీ, వ్యక్తిత్వ వికాసానికీ మాత్రం తల్లితండ్రులే ప్రథమ రూపకర్తలు.

 తరిగొప్పుల వీఎల్‌ఎన్ మూర్తి,

బడంగ్‌పేట్, హైదరాబాద్.