* దేశంలోనే అత్యుత్తమ కేబుల్ విధానం ఇక్కడ ఉండాలి
* వేసవిలో ఎట్టిపరిస్థితుల్లో విద్యుత్ అంతరాయం ఉండొద్దు
* విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాం తి): విద్యుత్ నష్టాలను తగ్గించడం, చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం వంటి సమస్యలను అధిగమించేందుకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2025ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి శనివారం సీఎం ఆవిష్కరించారు.
అనంతరం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం ప్రపంచంలోనే బెస్ట్ పాలసీలను పరిశీలించి నివేదికను తయారు చేయాలని కోరారు. దేశంలోనే ఉత్తమ అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేయాలని, ఆ దిశగా అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. అన్ని రకాల కేబుల్స్ అండర్ గ్రౌండ్‌లోనే ఏర్పాటు చేసేలా ప్రత్యమ్నాయాలను పరిశీలించాలని చెప్పారు.
వేసవికి సన్నద్ధం కావాలి
వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రణాళికతో ముందుకుపోవాలని సీఎం అధికారులను ఆదేశించా రు. ఎక్కడా విద్యుత్ అంతరా యం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిస్కంలదేనని చెప్పారు. గతేడాది మార్చిలో రాష్ర్టంలో పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరిందని, ఈసారి 16,877 మెగావాట్లకు చేరే అవకా శం ఉన్నట్టు సీఎంకు అధికారులు వివరించారు.
గరిష్ఠ విద్యుత్ డిమాండ్ అంచనాకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే సమీపంలోని మరో ఫీడర్ నుంచి ప్రత్యమ్నాయంగా సరఫరా చేసే వ్యవస్థను తయారు చేసుకోవాలని సూచించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే టాప్‌లో నిలపా లని కోరారు.
వికారాబాద్ జిల్లా పరిగి వద్ద 400 కేవీ సబ్ స్టేషన్ మంజూరైనా పదేళ్లుగా పెండింగ్‌లో ఉందని, దాని పురోగతి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను అందించాలని ఆదేశించారు. గోషామహల్‌లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ భవనం నిర్మించనున్న నేపథ్యంలో స్టేడియం పక్కనే ఉన్న సబ్ స్టేషన్‌ను మరోవైపు తరలించాలని చెప్పారు. మరింత అదనపు సామర్థ్యంతో పూర్తిగా అధునాతన టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు.
సమీక్షలో పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణభాస్కర్, డిస్కంల సీఎండీలు ముషారఫ్, వరుణ్‌రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ గూడేల్లో ప్రత్యేక డ్రైవ్
ఆదివాసీ గూడేల్లోని గృహాలకు సోలార్ విద్యుత్, పంపుసెట్లు ఉచితంగా అందించాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అటవీశాఖ, గిరిజన సంక్షేమంతోపాటు సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని సూచించారు.
నివేదిక వచ్చాక గూడేల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సోలార్ విద్యుత్ అందించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు సౌర విద్యుత్ ప్లాంట్ల వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీలను ఆహ్వానించాలన్నారు. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను కూడా పరిశీలించాలని సూచించారు.