* టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అండర్ గ్రౌండ్‌లో విద్యుత్ కేబుల్ లైన్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నట్టు టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అలీ తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్‌లో విద్యుత్ కేబుల్ వేయాలని ఆదేశించారని అన్నారు.
అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు వేయడంతో విద్యుత్ సంస్థలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ప్రమాదాలను నివారించవచ్చన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు గ్రేటర్ వ్యాప్తంగా ఓవర్ హెడ్‌లో ఉన్న కేబుళ్లను అండర్ గ్రౌండ్‌కు మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
అందుకు ఆసక్తి ఉన్న, సామర్థ్యం కలిగిన సంస్థలు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) ద్వారా తెలియజేయాలని కోరారు. అందుకు tgsouthern వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 33/11కేవీ సబ్ స్టేషన్లు 498, 1280 కిలోమీటర్ల పరిధిలో 33 కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్, 3725 కిలోమీటర్లు వరకూ 33 కేవీ ఓవర్ హెడ్ లైన్లు, 1022 పీటీఆర్‌లు, 957 కిలోమీటర్ల దాకా 11 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్, 21,643 కిలోమీటర్ల దాకా 11కేవీ ఓవర్ హెడ్ లైన్లు, 1.50 లక్షల డీటీఆర్‌లు, 58 వేల ఇంటర్మీడియట్ పోల్స్ ఉన్నాయన్నారు.