01-04-2025 01:18:51 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, మార్చి 31 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రు. 350 కోట్ల అంచనాలతో అధికారుల ప్రక్రియ దాదాపు పూర్తి అయిందని, వచ్చే నెల 4న ఢిల్లీలో ఉన్నతాధికారులతో సమావేశం ఉందని, ఈ సమావేశంలో తాను ప్రత్యక్షంగా హాజరవుతానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రు.29 లక్షల విలువగల చెక్కులను శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల డబల్ బెడ్ రూం ఇండ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రు. 35 కోట్లను మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
5 వేల ఇండ్లకు దాదాపు 20 వేల మంది ప్రజలు నూకపల్లి ఇందిరమ్మ కాలనీకి వెళ్తారన్నారు. నూకపల్లి ఇందిరమ్మ కాలనీని జగిత్యాల పట్టణంలో కలపడం కోసం క్యాబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం, గవర్నర్ ఆమోదం కూడా తెలపడం జరిగిందన్నారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా కేంద్రం లో క్రిటికల్ కేర్ యూనిట్ సైతం త్వరలోనే ప్రారంభం కానుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు ప్రధాన అంశాలుగా పని చేస్తుందన్నారు. ఉచిత విద్యుత్, రూ. 500 కు గ్యాస్ సరఫరా, సన్న బియ్యం, ఇందిరా క్రాంతి భవనం, రుణాలు, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, క్యాదాసు నాగయ్య, బాలే శంకర్, తాజా మాజీకౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.