calender_icon.png 29 October, 2024 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో.. రెవెన్యూ హల్‌చల్

30-08-2024 01:43:22 AM

సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు

  1. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నాయంటూ.. 
  2. పలు కాలనీల్లో 240 నోటీసులు జారీ 
  3. వాల్టా యాక్ట్ ప్రకారం ఇచ్చామన్న అధికారులు 

* నా ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్టయితే ప్రభుత్వం కూల్చివేయవచ్చు. అధికారులు నాకు టైం ఇస్తే సామాన్లు తీసుకొని ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోత. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. 

 తిరుపతిరెడ్డి, సీఎం సోదరుడు 

శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (విజయక్రాంతి): హైదరాబాద్ హైటెక్ సిటీలోని దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో పలు కాలనీలు ఉన్నాయంటూ అక్కడి నివాసాలకు రెవెన్యూ అధికారులు అంద జేసిన నోటీసులు సంచలనంగా మారా యి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. దుర్గం చెరువు పరిసరాలలో నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్ కాలనీ, అమర్ సొసైటీలోని ఇళ్లకు శేరిలింగంపల్లి మండల తహసీల్దార్ వెంకారెడ్డి నేతృత్వంలో ఈ నెల 3న మొదటిసారి నోటీసులు అందజేశారు.

రెవెన్యూ అధికారులు అదే నోటీసులను మరోసారి బుధవారం అందజేసిన విషయం గురువారం వెలుగులోకి రావడంతో ఒక్క సారిగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన ఈ భవనాలకు రెవెన్యూ అధికారులు వాల్టా చట్టంలోని 23(1) ప్రకారం నోటీసులు అందజేశారు. మాదాపూర్ అమర్ కో టివ్ సొసైటీ పరిధిలోని పలు భవనాలకు రెవెన్యూ అధికారులు బుధవారం నోటీసులు అందజేశారు.

ఈ నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నందున నెల రోజుల్లోగా ఇక్కడి నివాసాలను ఖాళీ చేసి, స్వచ్ఛందంగా తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వెంకారెడ్డి నోటీసులు జారీచేశారు. అంతేకాకుండా, నోటీసు అందజేసిన ప్రతి ఇంటి గోడపై ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)ను సూచిస్తూ ఎఫ్ అని అధికారులు రాశారు. 

240 మందికి నోటీసులు

దుర్గం చెరువును ఆనుకుని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరీ హిల్స్, అమర్ సొసైటీకి చెందిన 240 మందికి ఈ నోటీసులు అందజేశారు. ఇదే ప్రాంతంలో నివసించే ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులను అధికారులు జారీచేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న దుర్గం చెరువు కబ్జాలకు గురి కాకుండా అధికారులు హద్దు రాళ్లు పాతినా ఎవరూ పట్టించుకోకుండా పలువురు వ్యాపార సముదాయాలను నిర్మించారు.

సుమారు 100 ఎకరాలకు పైగా ఉన్న దుర్గం చెరువు విస్తీర్ణంలో హైటెక్ సిటీ నిర్మాణం అనంతరం క్రమక్రమంగా ఆక్రమణలు పెరిగాయి. ఈ ప్రాంతంలోనే అనేక మంది ప్రముఖుల నివాసాలు ఉండటం వల్ల ఎవరూ ఇక్కడి వారికి నోటీసులు ఇవ్వడానికి సాహసం చేయలేదు. ప్రస్తుతం హైడ్రా చెరువుల పరిరక్షణలో భాగంగా ఆక్రమణలను కూల్చివేస్తున్న నేపథ్యంలో శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్టుగా స్పష్టమవుతుంది. అయితే నోటీసులు అందుకున్న 240 మందిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సత్యం రామలింగరాజు కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ మిత్రుడు రామరాజు ఉన్నట్టుగా తెలుస్తున్నది. 

బీఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారు

సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి 

దుర్గం చెరువులోని ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలకు నోటీసులు జారీచేసిన విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గురువారం శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, 2015లో తాను కోటేశ్వర రావు అనే వ్యక్తి నుంచి భవనాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆ సమయంలో దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉందనే విషయం తనకు తెలియదని చెప్పారు. తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని వాల్టా చట్టం ప్రకారం అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు.

1995లోనే ఈ లేఔట్‌కు పర్మిషన్ వచ్చిందని చెప్పారు. ఒకవేళ తన ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్టయితే ప్రభుత్వం కూల్చివేయొచ్చని అన్నారు. అధికారులు తనకు టైం ఇస్తే ఇంటిని ఖాళీ చేస్తానని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. ఇదంతా బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్నదన్నారు. తనను అడ్డం పెట్టుకుని అమర్ సొసైటీలో నివాసం ఉంటున్న వారిని ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నారన్నారు. గత పదేళ్ల కాలంలో ఎన్నో అక్రమాలు చేశారని బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, నాయకులను విమర్శించారు.