లాభాల్లో సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతా లతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత కోలుకున్నాయి. ఐసీఐసీఐ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్సీ, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్ వంటి అధిక వెయిటేజీ కలిగిన సాక్స్‌లో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. మరోవైపు అమెరికాలో ఆగస్టు నెలకు సంబంధించి జాబ్ డేటా నిరుత్సాహంగా ఉండడం, చైనా వృద్ధిపై ఆందోళనలు ఆసియా మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 80,973.75 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,183.93) నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం కాసేపటి వరకు నష్టాల్లో కొనసాగింది. తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 80,895.05 - 81,653.36 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ.. చివరికి 375.61 పాయింట్ల లాభం తో 81,559.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 84.25 పాయింట్ల లాభంతో 24,936.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.95గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, కోటక్ మహీం ద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.74 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2527 డాలర్ల స్థాయి వద్ద ట్రేడవుతోంది.