నిజామాబాద్ (విజయక్రాంతి): మిడిమిడి జ్ఞానంతో డాక్టర్లుగా చలామణి అవుతూ రోగుల ప్రాణాలను హరించి వేస్తున్నారు. ఎటువంటి అర్హత లేకుండా లైసెన్స్ లేకుండా వైద్యవృత్తిని నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కల్లెడ గ్రామానికి చెందిన ఓ యువతి వైద్యుడిగా చలామణి అవుతున్న ఆర్ఎంపీ హరికృష్ణ వద్దకు వైద్యం కోసం వెళ్లి అతను ఇచ్చిన మాత్రలు వేసుకున్న కాసేపటికి ఆ యువతికి తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆందోళన చెందిన బంధువులు కుటుంబ సభ్యులు బాధితురాలిని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో యువతి మృతి చెందింది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడు హరికృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.