పాన్‌ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప2’ ఇప్పటివరకు రూ.1600 కోట్లకుపైనే వసూళ్లు రాబట్టింది. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలన్నింటికీ మంచి స్పందన వచ్చిం ది. ముఖ్యంగా నిర్మల్ జిల్లా యువ గాయని లక్ష్మి దాస.. శంకర్‌బాబు కందుకూరితో కలిసి పాడిన ‘పీలింగ్స్’ పాట అటు యూత్ ను ఉర్రూతలూగించింది.
ఇటు సంగీత ప్రియుల మనసూ దోచేసింది. ఈ పాటలోని స్టెప్పులు చూసిన కొందరు కొత్తగా ప్రయత్నించారని ప్రశంసలు కురిపించారు. ఈ స్టెప్పులపై అభ్యంతరం తెలిపినవాళ్లూ లేకపోలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ఈ ‘పీలింగ్స్’ పాటపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ పాట చిత్రీకరణ సందర్భంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను, ఆ పాటపై తన అభిప్రాయాన్ని పంచుకుంది.
‘పీలింగ్స్ రిహార్సల్ వీడియో చూసినప్పుడు ఆశ్చర్యపోయా. అల్లు అర్జున్ సర్‌తో కలిసి డ్యాన్స్ చేశానని మురిసిపోయా. అయితే ఈ సాంగ్ చేసేటప్పుడు మొదట్లో భయమేసింది. ఎందుకంటే ఎవరైనా నన్ను ఎత్తుకుంటే భయమేస్తుంది. ఈ పాటలో బన్నీ సర్ నన్ను ఎత్తుకొని స్టెప్పేస్తాడు. ఆ స్టెప్ షూట్ చేసేప్పుడు అసౌకర్యంగా ఫీలయ్యా. కానీ సుకుమార్ సర్, బన్నీ సర్ చెప్పిన మాటలు నమ్మిన తర్వాత ఆ స్టెప్పు ఇబ్బంది అనిపించలేదు.
అంతా ఫన్‌గా జరిగిపోయింది. ఈ పాట కొందరికి నచ్చకపోవచ్చు.. ప్రతీదీ అందరికీ నచ్చాలని లేదు. నేనున్నది జనానికి వినోదం పంచడానికే! విమర్శల గురించి ఆలోచిస్తే నా కొమ్మను నేనే నరుక్కున్నట్టే! అలా చేయ డం నాకిష్టం లేదు. నాపై నాకే అనుమానం ఉంటే నటిగా రాణించలేను కదా!’ అన్నది.