calender_icon.png 5 October, 2024 | 4:34 PM

కోడలు అప్పు కింద మామ పెన్షన్ హోల్డ్

05-10-2024 01:16:37 PM

వృద్ధున్ని అవస్థ పెడుతున్న బ్యాంకు మేనేజర్

కలెక్టర్ గారు మా గోడు చూడు 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి) : కోడలు స్వయం సహాయక గ్రూపులో అప్పు తీసుకుందని మామ వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారుడి కి ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టి అవస్థ పెడుతున్న బ్యాంకు మేనేజర్ వైనం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన రెడ్డి పోగు గోపయ్యకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పెన్షన్ గత కొన్ని నెలలుగా పెన్షన్ ఇవ్వకుండా బ్యాంక్ మేనేజర్ అవస్థ పెడుతున్నారని గోపయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు లోకి వెళితే గోపయ్య కోడలు రెడ్డిపోగు కరుణమ్మ డ్వాక్రా గ్రూపులో అప్పు తీసుకుంది. గోపయ్యకు ఏపీజీవీబీ బ్యాంకు ద్వారా పెన్షన్ రావాల్సి ఉండగా బ్యాంక్ మేనేజర్ పెన్షన్ ఇవ్వడం లేదని తెలిపాడు. జిల్లా కలెక్టర్ కల్పించుకొని తనకు పెన్షన్ ఇప్పించాలని, ఇబ్బంది పెట్టిన బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని గోపయ్య విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ ను వివరణ కోరగా సమస్య నా దృష్టికి రాలేదని పరిశీలించి, పరిష్కరిస్తానన్నారు.