calender_icon.png 20 November, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామా, అల్లుళ్లు వేమన శతకాలు వల్లె వేస్తున్నరు

10-09-2024 02:27:14 AM

  1. హరీశ్‌రావు సుద్దపూస కబుర్లు చెప్తున్నడు 
  2. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

హైదరాబాద్,సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన మామా, అల్లుళ్లు ఇప్పుడు వేమన శతకాలు వల్లె వేస్తున్నారని  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్  మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సుద్దపూస కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుగా హరీశ్, బీఆర్‌ఎస్ నేతల తీరు ఉందన్నారు. తెలంగాణలో పదేళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని చెరపట్టి ఇప్పుడు నీతులు బోధిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా బేరసారాలు చేసిన హరీశ్‌కు రాజ్యాంగం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని  నిలదీశారు.

విపక్ష ఎమ్మెల్యేలను బెదిరించి బీఆర్‌ఎస్‌లో  చేర్చుకున్న రోజులను మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు. రాజ్‌భవన్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి ఎటుపోయిందన్నారు.  మీ మామ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే అప్పుడు ఏమి చేశావని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు.  ప్రతిపక్ష పార్టీల గొంతుల పిసుకుతుంటే చప్పట్లు కొట్టింది నీవు కాదా? ప్రజా సంఘాలను ఖతం చేస్తుంటే పక్కనుండి భజన చేయలేదా? అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే వెకిలి నవ్వులు నవ్వింది మర్చిపోయావా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయింపుల గురించి, కోర్టు తీర్పుల గురించి మాట్లాడే హక్కు  లేదన్నారు.  రాష్ట్రంలో మళ్లీ ఉప ఎన్నికలు కావా లా? తెలంగాణ ప్రజలు మరోసారి కర్చు కాల్చి వాత పెడుతారు జాగ్రత్త అంటూ  హెచ్చరించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫరాయింపుపై హైకోర్టు తీర్పును కాంగ్రెస్ గౌరవి స్తోందని, ఈ విషయంపై స్పీకర్ కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.