calender_icon.png 21 January, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెగని డబుల్ పంచాయతీ

21-01-2025 12:00:00 AM

  • ఇండ్లు స్వాధీనం చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని లబ్ధిదారుల ఆందోళన

ఇండ్ల పట్టాలు ఇవ్వాలంటూ గజ్వేల్ ఐఓసీలో కూర్చున్న లబ్ధిదారులు

ముంపు గ్రామాల ప్రజలను ఒక్కొక్కరిగా ఖాళీ చేయించి ఇండ్లు అప్పగిస్తామంటున్న పోలీసులు 

నేడు కెసిఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు 

గజ్వేల్, జనవరి 20: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఇంకా తెగని పంచాయతీ గానే మిగిలిపోయింది. సోమవారం డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు  తమకు ఇండ్లను అప్పగించాలని, పట్టాలను పంపిణీ చేయాలంటూ గజ్వేల్   ఐఓసీ ప్రాంగణానికి తరలివచ్చారు. ఉదయం 10 గంటల  నుండి సాయంత్రం 6 గంటల వరకు  తమకు ఇండ్లు అప్పగించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే వరకు కదిలేది లేదని  ఐఓసీ వద్దనే భీష్మించుకు కూర్చున్నారు.

గజ్వేల్  సిఐ సైదా, ఆర్‌ఐ కృష్ణ  డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో మాట్లాడారు.  మరో 220 మంది మల్లన సాగర్ నిర్వాసితులకు ప్యాకేజీలు ఇవ్వడం  పూర్తయ్యాయని, వారిని ఖాళీ చేయించి ఇల్లు అప్పగిస్తామని చెప్పారు. అయినా పట్టు వీడని డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు తమకు వెంటనే ఇవ్వాలంటూ  డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు రెవెన్యూ అధికారుల్లో చలనం లేకపోవడంతో  ఐఓసీ గేటు వద్ద దారికి  అడ్డంగా కూర్చుని ధర్నా చేశారు.

సాయంత్రం  ఏసిపి పురుషోత్తం రెడ్డి, సిఐ  సైదా లు శుక్రవారం లబ్దారులకు ఇండ్లు అప్పగింత, పట్టాల పంపిణీ గురించి  మాట్లాడతామని చెప్పారు. అధికారుల సమాధానానికి  లబ్ధిదారులు తృప్తి చెందలేదు.

ఉదయం నుంచి ఐఓసీ వద్దనే న్యాయం కోసం నిరీక్షించడంతో   కొందరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. చేసేది లేకపోవడంతో లబ్ధిదారులు  ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. తమ సమస్యను కేసీఆర్ పరిష్కరించాలంటూ మంగళవారం ఉదయం ఎర్రవల్లిలోని కెసిఆర్ ఫామ్హౌస్ ను ముట్టడించనున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.