శ్రీలంకపై భారత్ ఘన విజయం l రాణించిన గొంగడి త్రిష, షబ్నమ్
కౌలాలంపూర్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ మహిళల అండర్ టీ ప్రపంచకప్‌లో భారత్ అజేయంగా సూపర్ సిక్స్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో వరుస విజయాలు నమోదు చేసిన అమ్మాయిల బృందం ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. కౌలాలంపూర్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
బ్యాటింగ్‌లో తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష రాణించగా.. బౌలర్ల సమిష్టి ప్రదర్శన జట్టుకు గెలుపును అందించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యంగ్ ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. త్రిష (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించగా.. మిథిలా వినోద్ (16) పర్వాలేదనిపించింది.
లంక బౌలర్లలో ప్రముది, లిమాన్సా, అసెని తలా 2 వికెట్లతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. రష్మిక సెవాండి (15) మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. షబ్నమ్, జోషితా, సిసోడియా తలా 2 వికెట్లు పడగొట్టారు.
గొంగడి త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకుంది. లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న భారత్ గ్రూప్ టాపర్‌గా సూపర్‌సిక్స్‌లో అడుగుపెట్టింది. శ్రీలంక రెండో జట్టుగా సూపర్ సిక్స్‌కు చేరుకుంది. ఆదివారం జరగనున్న సూపర్ సిక్స్ గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.