calender_icon.png 6 November, 2024 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీటీడీ హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు

19-07-2024 02:48:51 AM

హైదరాబాద్, జూలై 18 ( విజయక్రాంతి): తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని జే శ్యామలరావు పేర్కొన్నారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటళ్లను ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్‌ఎస్‌డీ) అధికారుల బృందంతో కలిసి గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో, ఎఫ్‌ఎస్‌డీ డైరెక్టర్ పూర్ణచంద్రరావుతో కలిసి హోటళ్లలో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్ర పరచడం తదితర పద్ధతులను పరిశీలించారు. కొన్ని కిరాణా సామాగ్రితో సహా అనేక కూరగాయలు కుళ్ళిపోయాయని, పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు శ్రీవారి భక్తులు తిరుమల హోటళ్లలో భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారైనట్లు ఫిర్యాదుల అందిన నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌డీ బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని, అపరిశుభ్రత పరిస్థితుల మధ్య హోటళ్లలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని హోటళ్లు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని చేపట్టనున్నామని తెలియజేశారు.

హోటల్లోని ఆహార పదార్థాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎఫ్‌ఎస్‌డీ డైరెక్టర్ మాట్లాడుతూ.. పలు హోటళ్లు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని తనిఖీల్లో తేలిందన్నారు. హోటళ్లలో కుళ్ళిన కూరగాయలు, ముందు రోజు తయారు చేసిన ఆహారం, పలుమార్లు ఉపయోగించిన నూనె, ఎఫ్‌ఎస్‌డీ నిబంధనలకు విరుద్ధమైన ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామన్నారు. 

మొబైల్ ల్యాబ్ ప్రారంభం

ఎఫ్‌ఎస్‌డీ డైరెక్టర్‌తో కలిసి ఈవో మొబైల్ ల్యాబ్, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్‌ను ప్రారంభించారు. ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన అన్ని పరికరాలు ఈ మొబైల్ ల్యాబ్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ మొబైల్ ల్యాబ్‌లో 80 రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేస్తారు. తిరుమలలో ఆహారం, నీటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు దీన్ని వినియోగిస్తారు.