దంపతుల బలవన్మరణం
భూపాలపల్లి, జనవరి 1 (విజయక్రాంతి): వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో జరిగింది. కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12) ఉన్నారు. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు.
అయితే గ్రామంలో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పర్చి ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు. కొద్ది నెలల క్రితం చందన సభ్యురాలిగా ఉన్న సంఘం సభ్యులంతా కలిసి రూ. 2.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. దీనికి ప్రతి వారం రూ.200 కిస్తీ కట్టాల్సి ఉంటుంది. కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించినా భర్త, పిల్లలు అనారోగ్యాని గురవడంతో చందన కిస్తీలు కట్టలేకపోయింది.
ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో దంపతులిద్దరూ మనోవేదనకు గుర చందన డిసెంబరు 6న గడ్డి మందు తాగగా.. స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందన మంగళవారం మృతిచెందింది.