calender_icon.png 3 April, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మి కారు ఇస్తే.. చంపేశాడు!

28-03-2025 01:06:10 AM

కామారెడ్డి, మార్చి 27 (విజయక్రాంతి): కారు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడని నమ్మి తన పేరున ఫైనాన్స్ కింద తీసుకున్న కారును అప్పగిస్తే.. సదరు వ్యక్తి కిస్తీలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేశాడు. కిస్తీలు చెల్లించాలని లేదంటే కారును అప్పగించాలని అడిగిన ఓనర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టి చంపేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమాన్‌పల్లిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ముత్యంపేట గ్రామానికి చెందిన ఈరబోయిన రమేశ్(35) ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో కొద్ది రోజుల క్రితం కారును కొన్నాడు.

కిస్తీలు చెల్లించడం వీలు కాలేదు. అదే సమయంలో ముత్యంపేటకు సమీపంలోని చింతమానుపల్లి గ్రామానికి చెందిన పల్లె పోచయ్య తనకు కారును ఇస్తే కారును నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుం టానని, కిస్తీలు కూడా చెల్లిస్తానని రమేశ్‌తో అన్నాడు. నమ్మిన రమేశ్ తన పేరున ఉన్న కారును పోచయ్యకు అమ్మాడు. కిస్తీలు పూర్తయిన తర్వాత పోచయ్య తన పేరున కారు కాగితాలు చేయించి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

కారును తీసుకున్న పల్లె పోచయ్య.. కిస్తీలు చెల్లించకపోవ డంతో ఫైనాన్స్ వారు రమేశ్‌పై ఒత్తిడి పెం చారు. కిస్తీలు అయినా చెల్లించాలని, లేదంటే కారు ను ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని పోచయ్యకు రమేశ్ చెప్పినా నిర్లక్ష్యం చేశాడు. కారును కూడా అందుబాటులో ఉంచకుండా పోచయ్య నిర్వహిస్తున్న ఇటుక బట్టీల వద్ద ఉంచుతున్నాడు. ఇది తెలుసుకున్న రమేశ్ గురువారం తెల్లవారుజామున ఇటుక బట్టీల ప్రాంతానికి వెళ్లి, వాయిదాల డబ్బులు చెల్లించాలని లేదంటే కారును అప్పగించాలని పోచయ్యను అడిగాడు.

దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో రమేశ్‌ను దొంగగా చిత్రీకరించిన పోచయ్య తన ఇటుక బట్టి కూలీలతో కలిసి రమేశ్‌ను చెట్టుకు కట్టేసి దాడి చేయించాడు. సృహ తప్పి పడిపోయిన రమేశ్ చనిపోయాడని భావించిన పోచయ్య పోలీసులకు సమాచారం ఇచ్చా డు. కారును చోరీ చేసేందుకు రావడంతో దొంగగా భావించి ఇటుక బట్టి కూలీలు చెట్టుకు కట్టేసి కొట్టారని చెప్పాడు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య అనిత, కుమారుడు భానుప్రసాద్, కూతుళ్లు వైష్ణవి, నందిత ఉన్నారు.