calender_icon.png 29 September, 2024 | 4:32 PM

ఉలి రవళి రామడుగు!ఉలి రవళి రామడుగు!

29-09-2024 12:00:00 AM

శిలలకు ఊపిరులూదే అద్భుత శిల్పకారులు

ఈ గడ్డకు ఆరు శతాబ్దాల చరిత్ర

గడికోట నిర్మాణం కూలీలుగా వచ్చి ఇక్కడే స్థిరపడ్డ కాశీ కులస్తులు

బల్మూరి విజయసింహారావు :

కరీంనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం అది. అక్కడ అడుగుపెట్టగానే మనకు ఇళయరాజా సంగీతాన్ని తలపించే ఉలిశబ్దాలు వినిపిస్తాయి. ఆరు శతాబ్దాలుగా అక్కడి శిల్పకారులు కఠిన శిలలకు జీవం పోస్తూ కారుణ్య మూర్తులుగా తీర్చిదిద్దుతున్నారు. అపురూప శిల్పకళతో దేవతా విగ్రహాలకు జీవం పోస్తున్నారు.

అక్కడి శిల్పాలు తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల్లోనూ వందలాది ఆలయాల్లో ప్రతిష్ఠించారు. ఆ గ్రామం రామడుగు.. శిల్పకళకు పెట్టింది పేరు. ప్రస్తుతం 35 కుటుంబాలు, 100కు పైగా శిల్పకారులు ఆ కళపై జీవనం సాగిస్తున్నారు. శిల్పకళనే నమ్ముకుని జీవిస్తున్న రామడుగు శిల్పకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లభించడం లేదు. 

కరీంనగర్, సెప్టెంబర్ 2౮ (విజయక్రాంతి): రామడుగు శిల్పకళకు 600 ఏళ్ల చరిత్ర ఉంది. రామడుగులో 600 సంవత్సరాల క్రితం గడికోట నిర్మాణం జరిగింది. ఆ సమయంలో 50 కుటుంబాలు కర్ణాటక నుంచి వచ్చి ఈ కోట నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.

కర్ణాటక కాశీ కులానికి చెందిన వీరు  కోట నిర్మాణం తర్వాత వారిలో కొందరు ఇక్కడే స్థిరపడి ఆనాటి కళకు వారసులుగా మిగిలారు. ఈనాటికి శిల్పకళతో అందరి మన్ననలు పొందుతున్నారు. ఇక్కడి శిల్పకారులు శిల్పం తయారీకి అమృత శిలను ఉపయోగిస్తారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగలాయిపేట, ఐతుపల్లి గ్రామాల నుంచి ఈ శిలలను తీసుకువస్తారు.

ఒక ఫీటు నుంచి 20 ఫీట్ల వరకు, నవగ్రహ విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు ఇక్కడ చెక్కుతారు. విగ్రహం సైజునుబట్టి ధరలు నిర్ణయిస్తారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల నుంచి ఇక్కడి వస్తుంటారు.

గ్రామ దేవతల నుంచి దేశ నేతల వరకు ఆంజనేయస్వామి, గణపతి, శ్రీరాముడు, శివలింగాలు విగ్రహాలకు వీరికి ఎక్కువగా ఆర్డర్లు వస్తుంటాయి. అయితే ఇప్పుడు అమృత శిల లభ్యత తగ్గిపోవడంతో గ్రానైట్ రాయిని కూడా శిల్పాలకు ఉపయోగిస్తున్నారు.

గూడెం సత్యనారాయణస్వామి శిల్పులు ఇక్కడివారే..

గోదావరికి ఆనుకుని మంచిర్యాల జిల్లాలో ఉన్న గూడెంగుట్ట (సత్యనారాయణ స్వామి) దేవాలయం నిర్మించింది, సత్యనారాయణ స్వామి విగ్రహాలను చెక్కింది రామడుగు శిల్పకారులే. గూడెంగుట్ట  రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

దీని తర్వాత పెద్దపల్లి జిల్లా నందగిరి, కరీంనగర్ జిల్లా నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల్లోని విగ్రహమూర్తులతోపాటు పలు ప్రసిద్ధ దేవాలయాల్లో విగ్రహాల శిల్పులు కాశీ కళాకారులే. కరీంనగర్ కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహం రామడుగు కళాకారులు రూపొందించిందే. ఇతర రాష్ట్రాల్లో కూడా పలు దేవాలయాల్లో ఇక్కడి కళాకారులు చెక్కిన విగ్రహాలు పూజలనందుకుంటున్నాయి.

శిక్షణ కేంద్రం ఏర్పాటు

ఒకప్పుడు ఈ శిల్పకళ ఒకే కులానికి పరిమితంగా ఉండేది. కాశీ కులస్తులు అని వారిని పిలిచేవారు. వంశపారంపర్యంగా వచ్చిన శిల్పకళను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఆసక్తి ఉన్న యువకులకు శిల్పకళలో శిక్షణనిస్తున్నారు. ఇందుకోసం హరి హరచారి శిల్ప నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నుంచి పదుల సంఖ్య లో కళాకారులు తయారయ్యారు.

ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత మంది కళాకారులు తయారయ్యే అవకాశం ఉంది. 70 కుటుంబాలు మొదట్లో ఈ కళను నమ్ముకుని జీవనం సాగించేవి. మొదటితరం వారి పిల్లల్లో చాలామంది వివిధ రంగాల్లో స్థిరపడడంతో ప్రస్తుతం 35 కుటుంబాలు, 100కు పైగా కళాకారులు శిల్పకళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా యం త్రపరికరాలు కా వాలని ప్రభుత్వానికి మొరపెట్టుకు న్నా, శిల్పకళను పరిశ్రమగా గుర్తించి ఆదుకోవాలని విన్నవించుకున్నా ప్రభుత్వా లు పట్టించుకోవడం లే దు. వీరు ప్రధాన రోడ్డుపైనే చెట్లకింద శిల్పాలు చెక్కుతూ మనకు కనిపిస్తుంటారు. ఎలాంటి నీడ లేదు, వర్షం పడితే పని ఆగిపోవాల్సిందే. ప్రభుత్వం తమ ను ఆదుకోవాలని ఈ కళను గుర్తించాలని కళాకారులు కోరుతున్నారు. 

ప్రభుత్వం ఆదుకోవాలి..

శిల్పకళను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బండరాయి ధరలు, పనిముట్ల ఖర్చులు రోజు రోజుకు పెరుగుతుండడంతో కళాఖండానికి సరైన గిట్టుబాటు ధర, ప్రోత్సాహం అందడం లేదు. మా తరంతోనే ఈ కళ ముగిసిపోతుందనే భయం మాలో ఉంది. నేను 30 ఏళ్లుగా ఈ కళను నమ్ముకుని జీవిస్తున్నాను.

నేటి యువతకు శిక్షణ ఇచ్చి ప్రోత్సాహించే ప్రయత్నం చేస్తున్నాం కాని ప్రభుత్వం యంత్రాలను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తే ఈ కళ సజీవంగా ఉంటి. మా తరం తర్వాతవారు చాలామంది వివిధ రంగాల్లో స్థిరపడడం వల్ల కళాకారుల సంఖ్య తగ్గుతుంది. రామడుగు శిల్పకళ అంతరించిపోకుండా ప్రభుత్వం ఆదుకోవాలి.

 శెకల్ల హరిహరాచారి, శిల్పాచార్యులు

ఈ కళను ప్రోత్సహించాలి

ఈ కళను ప్రోత్సహించినప్పుడే సజీవంగా ఉంటుంది. నేను ఈ కులవృత్తిమీదే ఆధారపడి నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. మా తండ్రి శ్రీనివాసాచారి 50 ఏళ్లు శిల్పాలు చెక్కాడు. గతంలో అనేక కుటుంబాలు శిల్పకళ మీదనే ఆధారపడి ఉండేవి. నేను 21 ఏళ్ల నుండి శిల్పాలు చెక్కుతూ విక్రయిస్తున్నాను. కరీంనగర్ కలెక్టరేట్ ముఖద్వారం ముందుపెట్టిన గాంధీ విగ్రహం నేను చెక్కిందే. ఈ కళను ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరు ప్రోత్సాహం అందించినప్పుడు సజీవంగా ఉంటుంది. 

 పెందోట రాజు, శిల్పాచార్యులు