calender_icon.png 29 December, 2024 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి

21-12-2024 03:03:23 AM

క్షిపణి, సైబర్ దాడులతో విరుచుకుపడ్డ రష్యా

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఉక్రెయిన్‌పై రష్యా భారీగా క్షిపణి, సైబర్ దాడులు చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్షిక మీడియా సమావేశం ముగిసిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌పై ఈ దాడులు జరగడం గమనార్హం. ఉక్రెయిన్ రాజధాని కీవ్ అధీనంలోని ప్రభుత్వ రిజిస్ట్రీలే లక్ష్యంగా హ్యాకర్లు దాడులు చేశారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ డిప్యూటీ ప్రధాని ఓలాహ్ స్టెఫలిష్నా వెల్లడించారు.

ఈ దాడులతో దేశంలోని చాలా సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ రిజిస్ట్రీలో ప్రజల జనన మరణాలు, వివాహాలు, ఆస్తులకు సంబంధించిన కీలక వివరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ‘ఇటీవల కాలంలో ఎన్నడూ లేనం తగా బయటి నుంచి సైబర్ దాడి జరిగింది. దీంతో జస్టిస్ శాఖ ఆధీనంలోని ఏకీకృత రిజిస్ట్రీలను మూసేసి.. సేవలను నిలిపేశాం. వీటి పునరుద్ధరణకు రెండు వారాల సమయం పడుతుంది’ అని స్టెఫలిష్నా పేర్కొన్నారు. 

జెలెన్‌స్కీ సొంత ఊరిపై మాస్కో గురి

జెలెన్‌స్కీ సొంత ఊరు క్రైవీ రిహ్‌పై మాస్కో గురిపెట్టింది. ఇక్కడి రెండంతస్తుల భవనంపై క్షిపణి దాడి చేసింది. అదే సమయంలో రాజధాని కీవ్‌పై మరోదాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వశాఖ స్పందిస్తూ బుధవారం కీవ్ దళాలు చేసిన దాడికి ఇది ప్రతిస్పందన అని పేర్కొంది. అమెరికా తయారీ ఏటీఏసీఎం క్షిపణులు ఆరు, బ్రిటన్ తయారీ స్ట్రామ్ షాడో మిస్సైల్స్ నాలుగు రోస్టోవ్ ప్రాంతంలో ప్రయోగించినట్లు వెల్లడించింది. దీనికి ప్రతిగానే తాము ఈ దాడి చేసినట్లు వెల్లడించింది.