25-02-2025 12:00:00 AM
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై సోమవారం(ఫిబ్రవరి 24) నాటికి మూడేళ్లయింది. 36 నెలలుగా ఇరుదేశాల మధ్య భీకర పోరు సాగుతోంది. ఇరువైపులా వేలాదిమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా భీకర దాడుల్లో ఉక్రెయిన్ సాధారణ ప్రజల కలల సౌధాలు పేకమేడల్లా నేలమట్టమయ్యాయి. లక్షల సంఖ్యలో ఇళ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. లక్షల కోట్ల ఆస్తులు ధ్వంసమయినట్లు అంచనా. ఆర్థికంగా, సైనికంగా చితికిపోయినా తలవంచకుండా అస్తిత్వమే లక్ష్యంగా ఉక్రెయిన్ ఇప్పటికీ పోరాడుతోంది.
సైనికంగా శక్తివంతమైన రష్యాను నిలువరించేందుకు మిత్రదేశాల సాయంతో ఉక్రెయిన్ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. దేశ భద్రతకోసం నాటో సభ్యత్వాన్ని జెలెన్‌స్కీ కోరుకోవడం ఈ యుద్ధానికి ప్రధాన కారణం. తన సరిహద్దులదాకా నాటో విస్తరించడం ఇష్టంలేని పుతిన్ 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి దిగారు. యుద్ధం ప్రారంభమైన కొత్తల్లో ఇది ఇంతకాలం కొనసాగుతుందని ఎవరూ ఊహించలేదు. కొద్దినెలల్లోనే రష్యా బలం ముందు ఉక్రెయిన్ తలవంచుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. అయితే మిత్ర దేశాలు ప్రధానంగా అమెరికా మద్దతుతో అది రష్యా దాడిని గట్టిగానే ప్రతిఘటిస్తూ వచ్చింది.
బైడెన్ అధికారంలో ఉన్నంతకాలం ఉక్రెయిన్‌కు అమెరికా సంపూర్ణ మద్దతు కొనసాగుతూ వచ్చింది. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పువచ్చింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని ఎన్నికల సమయంనుంచీ చెబుతూ వచ్చిన ట్రంప్ అధికారంలోకి రాగానే ఆ దిశగా చర్యలు మొదలు పెట్టారు. రష్యా ప్రధాని పుతిన్‌తో సుదీర్ఘంగా టెలిఫోన్‌లో సంభాషించిన ట్రంప్ త్వరలోనే ఇరువురమూ సమావేశమవుతానని, వేలాదిమంది అమాయకుల మారణహోమాన్ని ఆపడానికి తక్షణం యత్నిస్తానని ప్రకటించారు. దీనిలో భాగంగా సౌదీ అరేబియాలో ఇరుదేశాల ఉన్నతాధికారులు తొలి దఫా చర్చలు కూడా జరిపారు.
అయితే ఈ చర్చలకు తమను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహించిన జెలెన్‌స్కీ ఆ చర్చలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు కొనసాగిస్తున్న సహాయం ఇకపై కూడా కొనసాగించాలంటే అది తన దేశంలోని అపారమైన ఖనిజ సంపదలో వాటా ఇవ్వాలని ట్రంప్ షరతు పెట్టడంతో ఇప్పుడు జెలెన్‌స్కీ పరిస్థితి ‘కుడితిలో పడ్డ ఎలుక’లాగా మారింది. అంతేకాదు తనను ట్రంప్ నియంతగా అభివర్ణించడంపైనా ఆయన మండిపడుతున్నారు. తాను అధికారాన్ని పట్టుకు వేళ్లాడాలని అనుకోవడం లేదని, యుద్ధాన్ని ఆపడం కోసం అవసరమైతే పదవిని కూడా వదులుకొంటానని స్పష్టం చేశారు. అంతేకాకుండా రష్యాతో పూర్తిస్థాయి బందీల మార్పిడికీ సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్‌ను కాపాడుకోవడం తనకు ముఖ్యమని, అంతేతప్ప దేశాన్ని అమ్మేయలేనని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించడం విశేషం.
మరోవైపు తమను సంప్రదించకుండా ట్రంప్ రష్యాతో శాంతి చర్చలను ప్రారంభించడంపై అమెరికా నాటో మిత్రదేశాలు సైతం మండిపడుతున్నాయి. ఉక్రెయిన్‌కు సైనికపరంగా, ఆర్థికంగా మరింత అండగా నిలవాలని బ్రిటన్, ఫ్రాన్స్‌లాంటి దేశాలు భావిస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదనలకు ఉక్రెయిన్ గనుక అంగీకరిస్తే యూరప్‌లో రష్యాకు ఎదురు ఉండదని కూడా ఆ దేశాలు భయపడుతున్నాయి.
అయితే బలహీనంగా ఉన్న దేశానికి సైనిక, ఆర్థిక సాయం అందించడానికి బదులుగా ఆ దేశ సంపదను దోచుకోవడం అనే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు సంపన్న దేశాలు అనుసరించిన వైఖరినే ఇప్పుడు ట్రంప్ కూడా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకుల భావన. ఈ నెలాఖరులో పుతిన్‌తో సమావేశం కానున్నట్లు ప్రకటించిన ట్రంప్ యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ఆయనను ఎలా ఒప్పిస్తారు, జెలెన్‌స్కీ, నాటో మిత్రుల అభ్యంతరాలను ఎలా అధిగమిస్తారో చూడాలి. మొత్తంమీద ఈ ఏడాదిలోనే సుదీర్ఘ కాలంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడుతుందని ప్రపంచ దేశాలు ఆశగా ఉన్నాయి.