ప్రతిరోజు ఉదయాన్నే ఏం టిఫిన్ చేయాలి? ఏం చేస్తే ఇష్టంగా తింటారు? అని ఆలోచిస్తున్నారా? అయితే చాలా ఈజీగా.. టెస్టీగా ఉండే ఉగ్గాని మిర్చీ బజ్జీని ట్రై చేయండి. వేడి వేడి ఉగ్గాని, బజ్జీలు తింటుంటే ఆ మాజాయే వేరుగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ లొట్టలు వేసుకుని తింటారు. నూనె లోపల వేయించిన పచ్చిమిర్చి, అదే సమయంలో పులుపు, కారం కలిపిన మసాల మిరపకాయ బజ్జీలు తింటే మైమరిచిపోవాల్సిందే. అంతటి రుచికరమైన ఉగ్గాని బజ్జీలు వాన పడుతున్న సమయంలో తింటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం.
ఉగ్గాని తయారీ
100 గ్రాముల మరమరాలను నీటిలో ఒక రెండు నిమిషాలు నానబెట్టిన తర్వాత నీరు లేకుండా చేతితో గట్టిగా పిండి పక్కకు పెట్టుకోవాలి. ఇందులో పుట్నాల పప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్‌పై పాత్ర పెట్టి దాంట్లో మూడు చెంచాల నూనె పోసుకోవాలి. అది వేడికాగానే దాంట్లో పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు వేసి ఐదు నిమిషాలు మూత పెట్టాలి. టమాటలు బాగా మగ్గాక మరమరాలను వేసి ఐదు నిమిషాలు వేగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌లోకి ఉగ్గానిని తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి మిరపకాయ బజ్జీలు పెట్టుకుని తింటే సరిపోతుంది.
మిర్చీ బజ్జీలు తయారీ
శనగ పిండిలో సరిపడా ఉప్పు, బియ్యం పిండి, వంట సోడా, ఉప్పు, వాము, సరిపడా నీళ్ళు పోసి జారుగా పిండిని కలుపుకోవాలి. కడాయిలో డీ ఫ్రైకి సరిపడా నూనె పోసి ఒక్కో మిర్చీని శనగ పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది.
పలు ప్రాంతాల్లో ఫేమస్..
ఉగ్గాని బజ్జీ ఒక ప్రాంతానికే పరిమితం కాదు. రాయలసీమతో పాటు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్నాటకలో అన్ని వీధుల్లో బండిలపై, షాపుల్లో ఉగ్గాని బజ్జీలు అమ్మడం సర్వసాధారణం. ఇక మిర్చీ బజ్జీలు ఉగ్గానిలో నజ్జుకుని తినడం మాటల్లో చెప్పలేని అనుభూతి ఇస్తుంది.