calender_icon.png 7 February, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉల్టాపల్టా యూజీసీ!

07-02-2025 01:37:47 AM

  1. రాష్ట్రాల అధికారాలకు గండికొట్టేలా రెగ్యులేషన్స్
  2. రాష్ట్రాలకు సంబంధం లేకుండా వీసీ నియామకమా?
  3. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం
  4. యూజీసీ రెగ్యులేషన్స్ వ్యతిరేకిస్తూ ఆరు రాష్ట్రాల తీర్మానం

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): యూనివర్సిటీల వీసీల నియామకాల్లో రాష్ట్రాల అధికారాలకు గండికొడు తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ వ్యతిరేకిస్తున్నట్టు రాష్ర్ట ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. బెంగళూరులో జరిగిన ఆరు (బీజేపీయేతర) రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశా నికి తెలంగాణ తరఫున శ్రీధర్‌బాబు హాజరయ్యారు.

కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ విద్యామంత్రులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ అభిప్రాయాలను శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇప్పటిదాకా విశ్వవిద్యాయాల ఉపకులపతుల నియామకాన్ని చీఫ్ సెక్రటరీ సభ్యు లుగా ఉన్న సెర్చ్ కమిటీ చేపట్టేదని, ఇప్పు డు అసలు రాష్ట్రానికి సంబంధమే లేకుం డా వారిని నియమించే డ్రాఫ్ట్ రూపొందించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

ఉన్నత విద్యకు తెలంగాణ ఏటా రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, అవసరమైన చోట కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఉన్నత విద్యలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు అండగా నిలుస్తోందని చెప్పారు. దీన్ని ప్రోత్సహించాల్సిందిపోయి ఆటంకాలు కల్పించడమేమిటని శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉప కులపతులుగా పరిశ్రమ ల అధిపతులను, బ్యూరోక్రాట్లను, బయటి వ్యక్తులను నియమించే అవకాశాన్ని కల్పించాలన్న డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌లోని ప్రతిపాదన పట్ల ఆయన నిరసన వ్యక్తం చేసారు. ఉన్నత విద్యాసంస్థల్లో మూడు వేల మంది విద్యార్థులుంటేనే గ్రేడింగులు ఇస్తామని, ఉన్నత గ్రేడ్లు వస్తేనే కేంద్ర ప్రోత్సాహకాలు అందుతాయన్న ప్రతిపాదనను మంత్రి వ్యతిరే కించారు.

ఇది ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు కలిగించే చర్య అన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీసీ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయాలనడం పేదలను ఉన్నత విద్యకు దూరంచేసే ఆలోచనగా అభివర్ణించారు. 

జాతీయ విద్యా విధానం రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పడం చాలా సమస్యలను తీసుకొస్తుందన్నారు. డిగ్రీ కోర్సులకు ఏడాదిలో రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించాలంటే సిబ్బంది కొరత, మౌలిక సమస్యలు ఉంటాయని శ్రీధర్‌బాబు చెప్పారు.

ఒకే విద్యార్థి ఏకకాలంలో రెండు కోర్సులు చదవొచ్చన్న ప్రతిపాదన అమలు విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు అందజేయాలని మంత్రి పేర్కొన్నారు. యూజీసీ నూతన రెగ్యులేషన్లు రాష్ట్రానికి అమోదయోగ్యంగా లేవని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇప్పటికే అధికారికంగా లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. 

యూజీసీ రెగ్యులేషన్స్--2025లోని 15 అంశాలను వ్యతిరేకిస్తూ.. దాని అమలును నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరుతూ రాష్ట్రాల విద్యామంత్రులు, ప్రతినిధుల సమావేశం తీర్మానం చేసింది. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వం తరపున ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఏ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.