- ప్రత్యేక లోగో రూపకల్పన
- సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తాం
- గద్దర్ సినిమా అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
అవార్డులలో నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గద్దర్ సినిమా అవార్డుల కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో అవార్డుల ప్రదానం, అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై డిప్యూటీ సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు.
జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆవార్డులు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు.
కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిష్ఠ పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలని ఆదేశించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత పది సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన వారు చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారని, అవార్డుల పంపిణీ జరగలేదని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు, ఎండీ డాక్టర్ హరీశ్, ఈడీ కిషోర్‌బాబు, అవార్డుల కమిటీ చైర్మన్ బీ నర్సింగ్‌రావు, కమిటీ సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ్, హరీశ్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్, వేణు తదితరులు పాల్గొన్నారు.