calender_icon.png 2 April, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషకాల ఉగాది

30-03-2025 12:00:00 AM

పండగలు, శుభకార్యాలు ఏమైనా సరే భోజన ప్రియుల దృష్టి పిండి వంటల వైపే ఉంటుంది. పూర్ణం బూరెలు లేకుండా ఎటువంటి పండగ, ఫంక్షన్ పూర్తి కాదంటే అతిశయోక్తికాదు. అందరికీ ఇష్టమే.. అయితే తయారు చేసుకోవడం కొందరికి కష్టం. కొందరు వీటిని ఎంత ప్రయత్నించినా రుచిగా చేసుకోలేకపోతుంటారు. ఈ రోజు ఉగాది సందర్భంగా టేస్టీ టేస్టీ పూర్ణంతో చేసే ప్రత్యేకమైన రుచుల గురించి తెలుసుకుందాం.. 

కుడుములు

కావాల్సిన పదార్థాలుః పూర్ణం కోసం.. పచ్చి శనగపప్పు ఒక కప్పు, బెల్లం తురుము ఒక కప్పు, యాలకుల పొడి కొద్దిగా, గోధుమ పిండి ఒక కప్పు, బెల్లం సగం కప్పు, నూనె వేయించుకోవడానికి సరిపడా. 

తయారీ విధానంః ముందుగా పచ్చిశనగపప్పు ఉడికించి నీటిని వంపేయాలి. అంతలోపు బెల్లాన్ని పొడి చేసుకోవాలి. శనగపప్పు పూర్తిగా ఉడికిన తర్వాత అందులోని నీరంతా వంపేసి.. బెల్లం, యాలకుల పొడి కలిపి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పూర్ణాన్ని చిన్నచిన్న లడ్డూలుగా చేసుకోవాలి. తర్వాత గోధుమ పిండితో కుడుములు తయారు చేసుకుని దాన్ని పూర్ణంతో నింపి.. బయటకు రాకుండా ఒత్తుకోవాలి. చివరగా కుడుములను లేత గోధుమ రంగు వచ్చేవరకు నూనె వేయించుకుంటే సరిపోతుంది.  

పూర్ణంలో పోషకాలు

పూర్ణం చాలా తీయ్యగా, కమ్మగా, రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. మంచి బలాన్నిస్తుంది. మనసునూ ఆహ్లాదంగా ఉంచుతుంది. 

పూర్ణంలో కొత్త బెల్లం కన్నా పాత బెల్లంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెకు మంచిది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కిడ్నీ పనితీరును మెరుగు పరుస్తుంది. కళ్లు, కడుపు, కాళ్ల మంటలనూ తగ్గిస్తుంది. 

అమ్మాయిల్లో పీరియడ్ సమస్యలనూ బెల్లం తగ్గిస్తుంది. అమ్మాయి పుష్పావతి అయితే పాత బెల్లం, నువ్వులతో చేసిన ఉండలు చేసి పెట్టేవాళ్లు. ఇవి హార్మోన్లను సరిచేసి, కటి భాగానికి మంచి బలాన్నిస్తాయి. 

పోలెలు

కావాల్సిన పదార్థాలు: శనగ పప్పు ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, మైదా పిండి లేదా గోధుమ పిండి రెండు కప్పులు, యాలకుల పొడి లేదా సోంపు ఒక చెంచా, నెయ్యి వేయించడానికి సరిపడా. 

తయారీ విధానం: ముందుగా శనగపప్పును నానబెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత దాంట్లో బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, నూనె వేసి పిండిని పూరీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న ఉండలుగా చేసి మధ్యలో పూర్ణం పెట్టి చపాతీలా వత్తుకుని.. రెండువైపుల బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటే పోలెలు రెడీ అయినట్టే. 

పూర్ణం బూరెలు

కావాల్సిన పదార్థాలు: బియ్యం, మినపప్పు రెండు కప్పులు, శనగ పప్పు ఒక కప్పు, బెల్లం తురుము ఒక కప్పు, యాలకుల పొడి కొంచెం, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, నెయ్యి సగం కప్పు, నూనె వేయించడానికి సరిపడా. 

తయారీ విధానం: బూరెలు తయారు చేసుకోవడానికి ముందుగా మినపప్పు, బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి వేర్వేరుగా నానబెట్టాలి. సుమారు ఐదు గంటల తర్వాత నీరు పోయకుండా చిక్కగా మిక్సీ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పూర్ణం కోసం శనగపప్పును మెత్తగా ఉడికించుకుని దాంట్లో బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలిపి.. చిన్నచిన్న ఉండలుగా చేసుకొని ముందుగా తయారుచేసుకున్న మిశ్రమంలో ముంచి.. నూనెలో వేయించుకుంటే సరిపోతుంది.