31-03-2025 01:41:47 AM
యాదాద్రి భువనగిరి, మార్చి 30 (విజయ క్రాంతి): ఉగాది తెలుగు నూతన శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉగాది పర్వదినాన్ని ప్రజలు తెలుగు సాంప్రదాయాల తో ఘనంగా జరుపుకున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో, స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కరరావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఉగాది సందర్భంగా మండల కేంద్రాలలో ,పట్టణాలలో ఉగాదికి సంబంధించిన మామిడి ఆకులు, వేపాకు, మట్టి కుండలు, మామిడికాయలు, ఉగాదికి సంబంధించిన రకరకాల వస్తువులతో ఏర్పడ్డ దుకాణాలతో ఆ ప్రాంతాలన్నీ ఉగాది సంబరాలతో కొత్త వాతావరణం ఏర్పడింది. ప్రతి తండ్రి, తల్లి తన పిల్లలతో బజారుకు వెళ్లి ఉగాది వస్తువులను తెచ్చి ప్రతి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలతో, వేప మండల తో అలంకరించి.
షడ్రుచులతో పచ్చడి తయారు చేసి. భక్షాలతో భోజనం చేసి కుటుంబాలన్నీ కొత్త అనుభూతిని పొందాయి. ఎవరికివారు వారి పేర్ల మీద పంచాంగాలు చూసుకుని ఈ నూతన సంవత్సరం అంతా బావుందనే భావన కలిగి కొత్త ఆశలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుకున్నారు. ఆలయాలలో పూజారులు, పండితులు, అర్చకులు, భక్తులకు పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించి ఈ సంవత్సరం ఎలా ఉందో వివరించారు.
60 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చే శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం దేశానికి రాష్ట్రానికి ప్రజలకు అందరికీ బాగుంటుందని పంచాంగం తెలియజేస్తుందని పండితులు చెప్తున్నారు. పట్టణంలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో, పచ్చలకోట సోమేశ్వర ఆలయంలో, సాయిబాబా ఆలయంలో, స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాలు జరిగాయి.