31-03-2025 01:34:35 AM
పాపన్నపేట/మెదక్, మార్చి 30(విజయక్రాంతి)ఃమెదక్ జిల్లా వ్యాప్తంగా ఉగాది పర్వదినాన్ని ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. షడ్రుచుల మిళితంగా జరుపుకునే తెలుగు సంవత్సరాది ఉగాది పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నారు.
తెలుగు నూతన సంవత్సరంగా అందరి జీవితాల్లో కొత్త వెలుగులు వెలగాలని ఉదయం నుండే దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టే ఉగాది పండగ అన్ని వృత్తుల వారు, రైతులు, వ్యాపారులతో పాటు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పచ్చడిని సేవించి ఈ సంవత్సరం ఆయా రాశుల వారికి జరగబోయే లాభనష్టాల గురించి వేద పండితులు వివరించిన పంచాగ పఠనంతో తెలుసుకున్నారు.
ఏడుపాయలను దర్శించుకున్న కలెక్టర్ దంపతులు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, దంపతులు ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులకు ఆలయ అర్చకులు, వేదమంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అదనపు కలెక్టర్ నగేష్ కుటుంబ సమేతంగా ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాల స్వీకరించి ఆలయ విశిష్టత గురించి నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు , అర్చకులు తదితరులుపాల్గొన్నారు.