30-03-2025 08:39:01 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎడ్లబండ్ల ప్రదర్శన..
ఎడ్లబండ్ల ప్రదర్శనను తిలకించిన ప్రజలు..
ప్రశాంతంగా ఉత్సవాలు ఊపిరి పీల్చుకున్న పోలీసులు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఉగాది పర్వదినం సందర్భంగా ఎడ్లబండ్ల ప్రదర్శన ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు గ్రామాల్లో సైతం గ్రామదేవతల ఆలయాల చుట్టూ ఎడ్లబండ్లను రంగురంగులతో అలంకరించి ప్రదర్శనలు నిర్వహించారు. ఎడ్లబండ్ల ప్రదర్శనను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో ప్రముఖ వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో మహిళా మణులు పంచాంగ శ్రవణాన్ని వినిపించారు.
పార్టీలకతీతంగా కుల సంఘాలకతీతంగా ఎడ్లబండ్ల ప్రదర్శనలో పాల్గొని ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ పట్టణ కేంద్రాలే కాకుండా బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, భిక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివ నగర్, గాంధారి, నసురుల్లాబాద్, బీర్కూర్ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాలలో ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎడ్లబండ్ల ప్రదర్శనలు ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలు పట్టణ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. షడ్రుచులతో కూడిన పచ్చడిని తయారుచేసి పంచి పెట్టారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తోట లక్ష్మీ కాంతారావు, లు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.