14-03-2025 12:57:17 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మార్చి 13 (విజయ క్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు కల్పించే వివిధ రకాల ప్రయోజనాలు పొందేందుకు యు.డి.ఐ.డి కార్డు ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో యుడిఐడి కార్డులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇదివరకే సదరం సర్టిఫికెట్ ఉన్నవాళ్లు తిరిగి యు డి ఐ డి లో దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని అన్నారు. వారికి ఆన్లైన్ నందు యు డి ఐ డి కార్డు జనరేట్ చేయబడి పోస్టులో నేరుగా వస్తుందని తెలిపారు. కొత్తగా సదరం కోసం నమోదు చేసుకోవాలనుకునే వారు మాత్రమే యూ డి ఐ డి పోర్టల్ నందు ఆన్లైన్ దరఖాస్తు చేయాలని తెలిపారు.
www.swavlambancrad.gov.in పోర్టల్ నందు దరఖాస్తు చేయాలని తెలిపారు. మొత్తం 21 రకాల అంగవైకల్యం ఉన్నవారికి కార్డు జారీ అవుతుందని అన్నారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తును అధికారులు పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహించి కార్డు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్డు పోస్టులో దరఖాస్తుదారు ఇంటికి నేరుగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, డి ఆర్ డి ఓ శ్రీధర్, డీఈవో జనార్ధన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, మీసేవ సెంటర్ల నిర్వాహకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.