ఉగ్రవాదులకు మద్దతిచ్చినవారితో కలిశారు
దేశంలోనే శరద్‌పవార్ అత్యంత అవినీతిపరుడు
కేంద్రమంత్రి అమిత్ షా సంచలన ఆరోపణలు
పుణే, జూలై 21: ఔరంగజేబు అభిమానుల సంఘానికి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నాయకుడని కేంద్రమంత్రి అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పుణేలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర సమావేశంలో అమిత్‌షా పాల్గొని మాట్లాడా రు. రాష్ట్రంలో కూటమిగా ఏర్పడ్డ మహావికాస్ అఘాడీ ఔరంగజేబుకు ఫ్యాన్స్ క్లబ్ అని, ఆ సంఘానికి ఉద్ధవ్ నాయకుడని విమర్శించారు.
26/11 ముంబై దాడుల్లో దోషి అజ్మల్ కసబ్‌కు జైలులో బిర్యానీ పెట్టించిన వారితో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. 1993 వరుస పేలుళ్లలో దోషిగా తేలిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలని కోరిన వారు, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రచారం చేసే జాకీర్ నాయక్‌కు శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించిన వారితో ఉద్ధవ్ స్నేహపూర్వకంగా మెలుగుతున్నారని, అలాంటి వారితో ఉన్నందుకు సిగ్గుపడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అవినీతికి పరాకాష్ఠ
త్వరలో హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరగున్నాయని, ఇందులో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, రాహుల్‌గాంధీ అహంకారం దిగొ స్తుందని పేర్కొన్నారు. తాము అవినీతి చేస్తున్నామని విపక్షాలు చెబుతున్నాయని, కానీ ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ దేశంలోనే అత్యంత అవినీతిపరుడని తీవ్ర ఆరోపణలు చేశారు. తిలక్ పుట్టిన నేలలో అవినీతిని శరద్ వ్యవస్థీకృతం చేశారని మండిపడ్డారు.