కొత్తగా 1800 మందికి ఉపాధి
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ హైదరాబాద్‌లోని తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను మరింత విస్తరించనున్నట్లు శనివారం విస్తరణను ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరి ఇన్నోవేషన్ పార్క్‌లో కాన్ఫెడరేషన్ సూయిస్, స్విట్జర్లాండ్ ఇన్నోవేషన్ నిర్వహించిన టీఈపీఏ ఇన్వెస్ట్మెంట్ ఈవెంట్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో యూబీఎస్ ఇండియా చైర్మన్ హరాల్డ్ ఎగ్గర్ భేటీ అయ్యారు.
అనంతరం హరాల్డ్ ఎగ్గర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. యూబీఎస్ సేవల విస్తరణతో రానున్న రెండేళ్లలో కొత్తగా 1,800 మందికి ఉపాధి లభించనున్నది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్(జీసీసీ)కు హైదరాబాద్ డెస్టినేషన్‌గా నిలుస్తున్నదని పేర్కొన్నారు.
ఇప్పటికే తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 30 బిలియన్ డాలర్లు అధిగమించిందని గుర్తుచేశారు. యూబీఎస్ కార్యకలాపాల విస్తరణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై మరింత విశ్వాసాన్ని పెంచినట్లు వెల్లడించారు.