calender_icon.png 3 February, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూటర్న్‌లు.. యమగండాలు

03-02-2025 12:00:00 AM

  1. వాహనదారులకు యూటర్న్ కష్టాలు
  2. యూటర్న్ వద్ద నిత్యం ప్రమాదాలు
  3. లింక్ రోడ్లు లేక తీవ్ర ఇక్కట్లు
  4. చిన్నపాటి దూరానికి కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి
  5. ఎల్బీనగర్, సాగర్ రోడ్డు, కర్మన్ ఘాట్ రోడ్లల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ మూసీవేత, యూటర్న్ ఏర్పాటు 
  6. చుట్టూ తిరుగుతూ వాహనదారుల ఇక్కట్లు 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 2 : ఎల్బీనగర్, సాగర్ రోడ్డు, కర్మన్ ఘాట్ రోడ్లల్లో ఒకప్పుడు ట్రాఫిక్ కష్టాలు తిప్పలు పెడితే.. ఇప్పుడు యూటర్న్ ఏర్పాట్లతో మరింత ఇక్కట్లు పెడుతున్నాయి. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడంతో వాహనదారులు కొద్ది దూరం వెళ్లి.. చేరాల్సిన స్థానాలకు వెళ్లేవారు.

కానీ, జాతీయ రహదారి విస్తరణతో ఫ్రీ ట్రాఫిక్ పేరుతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎత్తేశారు. దీంతో వాహనదారులు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న కాలనీలకు వెళ్లాలంటే యుద్ధం చేయాల్సినంత కష్టం పడుతున్నారు. యూటర్న్ వద్ద నిత్యం ట్రాఫిక్ ఏర్పడుతున్నది. కాలనీలకు వెళ్లే దారులన్నీ మూసివేయడంతో కిలోమీటర్ల దూరం వెళ్లి, ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒకప్పుడు ప్రతి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండేవి. కానీ, ట్రాఫిక్ కష్టాలు తీరేలా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది లేకపోవడంతో ఫ్రీ ట్రాఫిక్ పేరుతో ఉన్న సిగ్నల్స్ తీసేశారు. సిగ్నల్స్ బదులుగా యూటర్న్‌లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ పోలీసులు చేతులు దులుపుకున్నారు. దీంతో వాహనదారుల కష్టాలు పెనం మీది నుంచి పెయ్యిలో పడిన చందంగా మారింది.

100 మీటర్ల దూరంగా ఉన్న చౌరస్తా వెళ్లడానికి కిలోమీటర్ దూరం వెళ్లి, తిరిగి రావాల్సి వస్తున్నది. కొద్దిదూరమేనని వస్తే రాంగ్ రూట్ లో వస్తున్నారని ట్రాఫిక్ చలాన్లు మీద పడుతున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జాతీయ రహదారులపై ట్రాఫిక్ సిగ్నల్స్ తీసివేసి, కిలోమీటర్ల దూరంలో యూటర్న్ లు ఏర్పాటు చేశారు.

ఫలితంగా వాహనదారులు వాహనాన్ని బయటకు తీస్తే లింక్ రోడ్డు లేకపోవడంతో కిలోమీటర్ల దూరం వెళ్లి, ఇంటికి రావాల్సి వస్తున్నది. యూటర్న్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతోపాటు నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ఎల్బీనగర్, చింతలకుంట, పనామా, సుష్మ థియేటర్, ఆటోనగర్, జింకల పార్కు, హైకోర్టు కాలనీ, హయత్ నగర్ డిపో, హయత్ నగర్ వరకు చౌరస్తాలు ఉండేవి.

కానీ, జాతీయ రహదారి విస్తరణతో ఆయా చౌరస్తాలు కనుమరుగ య్యాయి. ఇప్పుడు కేవలం ఎల్బీనగర్, విష్ణు థియేటర్, ఆటోనగర్, హయత్ నగర్ హైవే బావర్చి యూటర్న్ లు మిగిలాయి. ఆయా చౌరస్తాను మూసివేసి, యూటర్న్ లను ఏర్పాటు చేశాడు. దీంతో చింతలకుంట, సుష్మ, హైకోర్టు కాలనీ, హయత్ నగర్ డిపో స్టాప్ పరిధిలో ఉన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇంటి నుంచి బయటకు వస్తే కిలోమీటర్ల దూరం వెళ్లి, అక్కడ యూటర్న్ తీసుకుని తిరిగి ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగర్ రోడ్డు, కర్మన్ ఘాట్ రోడ్లు ల్లో యూటర్న్ లు ఏర్పాటు చేశారు. బీఎన్ రెడ్డి, హస్తినాపురం, సాగర్ రోడ్డు వరకు, సాగర్ రోడ్డు మీదుగా టీకేఆర్ కమాన్, ముందు మల్లమ్మ చౌరస్తా వరకు, సాగర్ రింగ్ రోడ్డు మీదుగా బైరామల్ గూడ, కర్మన్ ఘాట్, చంపాపేట డీమార్ట్, ఐఎస్ సదన్ వరకు యూటర్న్ లు ఏర్పాటు చేశారు.

దీంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న కాలనీవాసులతోపాటు వాహనదారులు చుట్టూ తిరుగుతూ వెళ్తున్నారు. పాదచారులు రోడ్డు దాటడానికి వీలులేకుండా డివైడర్ల మధ్యన బారికేడ్ వంటి కొంచెం ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు దాటే అవకాశం లేకుండా పోయింది.

యూటర్న్ లు ఏర్పాటు.. నిత్యం ప్రమాదాలు

లింక్ రోడ్లు మూసివేయడంతో యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న కాలనీల ప్రజలు, వాహనదారులు బయటకు వెళ్లాలన్నా... తిరిగి ఇంటికి రావాలన్నా యుద్ధం చేయా ల్సిన అన్నంతగా పరిస్థితి ఏర్పడుతున్నది. హయత్ నగర్ పరిధిలో హైవే బావర్చి వద్ద యూటర్న్ ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతోపాటు ఆటోనగర్ యూటర్న్ సైతం ప్రమాదాలకు నిలయంగా మారింది.

ఇరువైపులా భారీస్థాయిలో వాహనాలు వస్తుండడం.. యూటర్న్ వద్ద వాహనాలు మలుపు తీసుకుంటున్న సమ యంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతు న్నాయి. వేగంగా వచ్చే వాహనదారులు యూటర్న్ వద్ద మలుపు తీసుకుంటున్న వాహనాలను గుర్తించక వేగంగా వస్తుండ డంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వాహనదారుల గొడవలు అధికంగా జరుగుతున్నాయి. ఇలాంటి నిత్యం ప్రతి యూటర్న్ వద్ద జరుగుతున్నది.

హైవే పనుల తర్వాత మరిన్ని యూటర్న్

విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో యూటర్న్ ల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోడ్డు పనులు పూర్తయిన తర్వాత యూటర్న్ లు ఏర్పాటు చేస్తాం. హయత్ నగర్ పరిధిలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్, వినాయక నగర్, పుల్లారెడ్డి వద్ద కొత్తగా యూటర్న్ ఏర్పాటు చేస్తాం. దూరమైనా వాహనదారులు రాంగ్ రూట్ లో రావద్దు.

  గట్టుమల్లు, వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్