calender_icon.png 28 December, 2024 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కట్టడాల కూల్చివేతలో యూటర్న్...

04-09-2024 11:51:25 AM

మంథని అధికారుల తీరుపై అనుమానాలు...

పేదోళ్లవి కూల్చి... పెద్దోళ జోలికి వెళ్లని వైనం స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు

మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలో అధికారులు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారా... ఏమైనా లాబీయింగ్ జరిగి  ఉంటుందా... అన్న అనుమానాలు ఇప్పుడు మంథనిలో చర్చనీయాంశంగా మారాయి. చాలా యేళ్లుగా మంథనిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేత చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా మంథనిలో కూడా అధికారులు సాహసోపేత నిర్ణయం తీసుకొని మంథనిలో తొలుత కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దీనితో మంథని పట్టణ ప్రజల నుంచి మొదట్లో హర్షం వ్యక్తమైంది.

అంతలో ఏం జరిగిందో తెలియదు కానీ.. అధికారులు వెనుకడుగు వేశారు. కొంతమంది కోర్టును ఆశ్రయించారన్న నెపంతో కూల్చివేతల జోలికి వెళ్లకుండా మిన్నకున్నారు. మళ్లీ ఇటీవల మంథని పట్టణం నడిఒడ్డున మార్కెట్ ఎదురుగా రోడ్డు ప్రక్కన ఉన్న దుకాణాలను ఉన్నపలంగా తొలగించారు. దీనితో మార్కెట్ పరిసరాల్లో కూడా నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగిస్తారని అంతా భావించారు. మళ్లీ ఏం జరిగిందో ఏమో గానీ.... కేవలం రోడ్డు పక్కన సామాన్యులు వేసుకున్న దుకాణాలు మాత్రమే తొలగించి ఇతర అక్రమ కట్టడాల జోలికి వెళ్లకుండా మరోసారి యూటర్న్ తీసుకున్నారు. దీనితో అధికారుల తీరుపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం పేదోళ్లవి కూల్చి పెద్దోళ్ళ జోలికి వెళ్లడం లేడన్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. మార్కెట్ ఏరియా పరిసరాల్లో చాలా అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ అవి మాత్రం కనిపించడు లేదా అని పలువురు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై మంథని మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరేందుకు విజయక్రాంతి ఫోన్ లో ప్రయత్నించగా అందుబాటులోకి రావడం లేదు.